ప్రస్తుతం పల్లెటూళ్లలో నాణ్యమైన గాలిని పీల్చుకుంటున్నారు. కానీ సిటీల్లో మాత్రం ఎయిర్ పొల్యూట్ అయి చిన్నా, పెద్దా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అయితే మీరు ఉండే ప్రాంతంలో గాలి నాణ్యతను తెలుసుకోవడానికి .. గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఓ ఫీచర్ చాలా మందికి తెలీదు. గాలి నాణ్యతను సులభంగా తెలుసుకోవడానికి వీలుగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది గూగుల్. గూగుల్ మ్యాప్స్‌లో ఏక్యూఐ రీడింగ్‌లు అందరికీ ఈజీగా అర్థమయ్యే ఫార్మాట్‌లో ఉంటాయి. దీని ద్వారా ఏ ప్రాంతంలో అయినా వాతావరణం, గాలి నాణ్యత వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 లోపు ఉంటే ఆరోగ్యానికి మంచిది. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైన స్థాయిగా.. 101-200 మధ్య ఉంటే మితమైన స్థాయిగా.. 201-300 వరకు ఉంటే హానికరమైన స్థాయి అని అర్ధం. అలాగే 301-400 మధ్య ఉంటే ఇంకా ప్రమాదకర స్థాయిగా.. 401-500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. గూగుల్ డిఫరెంట్ కలర్స్ ఉపయోగించి మ్యాప్ లోని గాలి నాణ్యతపై సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు గ్రీన్ కలర్ను గుడ్ అని చెప్పడానికి ఉపయోగిస్తే.. రెడ్ కలర్ వెరీ పూర్ అని చెప్పడానికి ఉపయోగిస్తుంది.
అంతేకాదు వాతావరణం, గాలి నాణ్యత మెరుగ్గా లేనప్పుడు గూగుల్ మ్యాప్ హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గూగుల్ సూచిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఉబ్బసం, శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు ఇంట్లోనే ఉండాలని సూచిస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్ క్వాలిటీ సరిగా లేని ప్రదేశంలో నివసిస్తుంటే మాత్రం కచ్చితంగా.. ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించాలని సిఫార్స్ చేయడమే కాకుండా..దాని కోసం సరైనదాన్ని ఎంపిక చేసుకోవడంపై క్లియర్ గా గైడెన్స్ కూడా అందిస్తుంది.
మీ లొకేషన్ ఎయిర్ క్వాలిటీ గురించి తెలుసుకోవడానికి మొదట గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేయాలి. తర్వాత లేయెర్స్ ఐకాన్పై క్లిక్ చేసి ఎయిర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటే..ఇది మీ లొకేషన్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను చూపిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటే ఇదే పద్ధతిని ఉపయోగించి ఆ ప్రదేశంలోని ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకుని దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవచ్చు.