మారుతున్న కాలంతో పాటు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో..తెల్ల అన్నానికి బైబై చెప్పేసి.. బ్రౌన్ రౌస్ తో మీల్స్ అలవాటు చేసుకుంటున్నారు చాలామంది.కానీ అమ్మాయిలు మాత్రం ఆరోగ్యంతో పాటు అందం కూడా కావాలంటూ బ్రౌన్ రైస్ వాడేసి మెరిసిపోతున్నారు. అవునండి ఇది నిజం..వందలు వేలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లో ఉంటూనే అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. జుట్టు , చర్మానికి కూడా దంపుడు బియ్యం వాడేస్తూ రిజల్ట్ చూసుకుని మురిసిపోతున్నారు.
నునుపైన స్కిన్ కోసం మహిళలు ఎప్పుడూ పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటివారికి బ్రౌన్ రైస్ ఓ వరం లాంటిది. మచ్చలేని చర్మం కోసం అరకప్పు బ్రౌన్ రైస్, 1 కప్పు నీరు ఉంటే చాలు. బియ్యాన్ని శుభ్రమైన గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. పోషకాలు నీటిలో కలిసిపోయే వరకు దాదాపు 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటర్ ను వేరే గిన్నెలోకి పోసుకుని శుభ్రమైన కాటన్ బాల్‌ను ద్రవంలో ముంచి, దానితో మీ ముఖం , మెడను శుభ్రం చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు మెత్తగా మసాజ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచి మామూలు నీటితో కడిగితే సరిపోతుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఫేస్ క్లీన్ అయిపోయి ట్యాన్ ప్యాక్ ఎఫెక్ట్ వస్తుంది.
బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం చర్మ స్థితిస్థాపకతను కాపాడటానికి , చర్మపు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం బ్రౌన్ , పెరుగు అవసరం. ఈ ఫేస్ మాస్క్ చేయడానికి, ముందుగా బ్రౌన్ రైస్‌ని నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. అర టీస్పూన్ గ్రౌండ్ రైస్‌తో ఒక చెంచా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి… దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే ముఖం మీ సొంతం అయిపోతుంది. మీరు వారానికి 2 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలంలో బ్యూటీ పార్లర్లకు వెళ్లి కరోనా ముప్పులోకి వెళ్లే కంటే ఇంట్లో ఉంటూనే అందాన్ని కాపాడుకోవచ్చు.
అలాగే మొటిమలను తగ్గించుకోవడానికి 2 చెంచాల బ్రౌన్ రైస్ అవసరం. ముుందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. బియ్యం నీటిలో దూదిని ముంచి ఎక్కడ అయితే పింపుల్స్ ఉన్నాయో వాటిపై రాయాలి. కాస్త ఆరగానే పింపుల్స్ ఉన్న చోట మళ్లీ రాయాలి. ఇలా 2,3 సార్లు చేసి ఆరిపోయాక గోరువెచ్చని నీటిని ఉపయోగించి ఫేస్ ను కడుగుకోవాలి. ఇలా రోజూ చేస్తే వెంటనే రిజల్ట్ ఉంటుంది. కుదరక పోతే రోజు విడిచి రోజు చేసినా ఫలితం ఉంటుంది.
ఒత్తయిన , మెరిసే జుట్టు కోసం అయితే ..బ్రౌన్ రైస్ నానబెట్టిన నీటిని తలస్నానం చేశాక జుట్టుపై పోసుకుంటే కండిషనర్ లా ఉపయోగపడుతుంది. లేదా బ్రౌన్ రైస్ వాటర్ ను తలకు పట్టించి అరగంట తర్వాత తలంటు పోసుుకున్నా జుట్టు నిగనిగలాడటమే కాకుండా గ్రోత్ బాగుంటుంది. మొత్తంగా అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే బ్రౌన్ రౌస్ ఇంట్లో లేకపోతే అర్జంటుగా వెళ్లి తెచ్చేసుకోండి మరి.