లావుగా ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ తినొచ్చా?

Can Obese People Eat Idli For Breakfast

ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ తొందరగా డైజస్ట్ అవడంతో పాటు ఆయిల్ ఫుడ్ కాకపోవడంతో.. చిన్నపిల్లలకూ కూడా హెల్దీ ఫుడ్ గా ఇడ్లీ అనే చెబుతారు. మెత్తగా ఉండే ఇడ్లీలు.. ఫాస్ట్ ఫాస్ట్ గా తినడానికి, క్యారీ చేయడానికి కూడా బాగుండటంతో ఉద్యోగులు కూడా ఇష్టపడతారు. అయితే ఇడ్లీలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, లావు అవుతామనే భయాలు పెట్టుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇడ్లీలో కొలెస్ట్రాల్ అనే మాట ఉండదంటన్నారు.

ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మధ్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రాముల కొవ్వులు, 1.43 గ్రాముల మాంసకృతులు, 11.48 గ్రాముల పిండి పదార్థాలు, 1.1 గ్రాముల పీచు పదార్థాలు, 279 మిల్లీ గ్రాముల సోడియం, 9 మిల్లీ గ్రాముల పొటాషియం, 1 మిల్లీ గ్రాముల ఇనుము లభిస్తాయి. అందుకే ఇడ్లీలలో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయని వైద్యులు చెబుతూ ఉంటారు. రోగులకు సైతం ఇడ్లీ పెట్టొచ్చని సలహా ఇస్తుంటారు. దానికి తోడు ఇడ్లీలో కొలెస్ట్రాల్ వుండదు. క్యాలరీలు కూడా తక్కువే వుంటాయి.

ఇడ్లీలు తెల్లగా రావాలని పొట్టు తీసిన మినపప్పును, తెల్లటి బియ్యపు రవ్వను వాడకూడదు. దీనివల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతవరకు నష్టపోతారు. మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండిపదార్థాలు శక్తినిస్తాయి. రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని బి విటమిన్లనూ పొందవచ్చు. పిండి పదార్థాల వల్ల ఇడ్లీలు తేలికగా జీర్ణం అవుతాయి.

ఇడ్లీతో పాటు గుడ్లు, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. ఇటీవలికాలంలో ధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్నారు. ఇవి పోషకాల్లో మెరుగైనవి. బియ్యానికి బదులు చిరుధాన్యాల్ని వాడితే ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి. పైగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే లావుగా ఉన్నవారు కూడా వీలయినప్పుడల్లా ఇడ్లీలను బ్రేక్ ఫాస్ట్ లో యాడ్ చేసుకోచ్చని అంటున్నారు.