జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా ఇలా చెక్ పెట్టండి..

పెరుగుతున్న కాలుష్యం, విపరీతమైన ఒత్తిడిలు, సమయం లేక జుట్టు సంరక్షణ గాలికొదిలేస్తున్నారు. దీనివల్ల జుట్టు రాలే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు మంచి నిద్ర కూడా ఉండాలి. దీంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఒత్తైన జుట్టు పెరగడంతో పాటు తెల్ల జుట్టు, చుండ్రు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు.

జుట్టు ఒత్తుగా పెరగడానికి..అలొవేరా జెల్,ఈ విటమిన్ కాప్సిల్స్, కొబ్బరి నూనె, ఆముదం సరిపోతాయని నిపుణులు అంటున్నారు. అలొవెరా జెల్‌ని తీసుకుని జుట్టుకి పట్టించి ఓ అయిదు నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఆ తరువాత మరో బౌల్‌లో ఈ-విటమిన్ కాప్సిల్‌లో ఉండే ఆయిల్‌ని తీసుకుని అందులో 1 స్పూన్ ఆముదం, 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా వేడి నీరు కూడా జత చేయాలి. దీన్ని తలకు పట్టించి 5 నిమిషాలు మర్దనా చేయాలి. ఓ గంట సేపు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు మృదువుగా ఉండడమే కాకుండా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

చుండ్రు నివారణకు..1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ కుంకుడుకాయ పొడి,1 స్పూన్ పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి గంటసేపు నానబెట్టాలి. దీన్నితలకు ప్యాక్‌లా వేసి 45 నిమిషాలు వుంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది తలలో వుండే చుండ్రుని షాంపూల కంటే మంచి ఫలితాన్నిస్తుంది.
తెల్లజుట్టును నల్లగా మార్చటానికి..4 స్పూన్ల గోరింటాకు పొడి, 4 స్పూన్ల ఉసిరి పొడి, 4 స్పూన్ల కుంకుడుకాయ పొడి లేదా 4 స్పూన్ల శీకాయ పొడి తీసుకోవాలి. గోరింటాకు పొడి తప్ప మిగిలిన రెండు పొడులను నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఈ పేస్ట్ కు ఉదయాన్నే గోరింటాకు పొడి కలిపి ఒక గంటపాటు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.