కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా?

Cramping Legs And Arms What Causes Frequent Cramps | Mango News Telugu

చాలా మందికి కూర్చున్నప్పుడు.. చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఇలా జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. వాయిదా వేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నిజానికి అసాధారణ జీవన శైలి కారణంగా.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. కొద్ది లక్షణాలే అని లైట్ తీసుకోవడంతో తర్వాత అవే.. పెద్ద రోగానికి దారితీసి డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే..తరచూ వచ్చే కాళ్లు, చేతుల తిమ్మిర్లు కూడా ఇలాంటిదే అని గుర్తించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిస్ కారణంగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. అందుకే, ఈ తిమ్మిర్ల సమస్య తరచుగా ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి.

చాలా మంది రాత్రిపూట ఒకే స్థితిలో ఎక్కువసేపు నిద్రపోతుంటారు. దానివల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు వచ్చినట్లు అవుతుంది. రక్త ప్రసరణ లేకపోవడం వలన కూడా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. అయితే తిమ్మిరి ఉన్న ప్రదేశంలో కాసేపు మసాజ్ చేస్తే తగ్గుతుంది. కానీ, ఇలా నిత్యం జరుగుతుండటం, చేతులు మొద్దుబారినట్లు అనిపిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే చెప్పాలి.

కొన్నిసార్లు సరిగా కూర్చోకపోవడం వల్ల కూడా వెన్నుపాము చుట్టూ నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయ సమస్యలు మొదలవుతాయి. ఈ కారణంగానూ చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తాయి. అయితే, ఈ సమయంలో వైద్యుడిని సంప్రదించడం మేలు. లేదంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

థైరాయిడ్ గ్రంథుల్లో ఇబ్బందుల వలన కూడా చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తాయి. ఒకరకమైన షాక్ వచ్చినట్లు అనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా రక్త పరీక్ష చేయించుకోవాలి.

ఇప్పుడు చాలా మంది రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేస్తుంటారు. దీని కారణంగా.. మణికట్టు నరాలపై దుష్ప్రభావం ఉంటుంది. ఫలితంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణం చేతులు తిమ్మిర్లు రావడమే. ఇదే పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.