కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలిసిందే. నీరసం, అలసటగా అనిపించిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు కూడా చెబుతుంటారు. కొబ్బరి నీరు డైలీ తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే కొబ్బరి నీరు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
ముఖ్యంగా కొబ్బరి నీరును ఉదయం పరగడుపున తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో కొబ్బరి నీరుకి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మందికి తెలియక కొబ్బరి నీరు తాగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల ఆరోగ్యమైన కొబ్బరి నీరు కూడా చివరికి అనారోగ్యం అయిపోతాయి. మరి తెలియకుండా చేసే ఆ చిన్న తప్పులు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ఎక్కువ శాతం మంది కొబ్బరి నీరును స్ట్రా వేసి తాగుతుంటారు. కానీ కొబ్బరి నీళ్లను ఎప్పుడూ గ్లాసులో వడపోసిన తర్వాతే తాగాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి లోపల ఫంగస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటే స్ట్రాతో తాగితే తెలీకుండానే తాగేస్తాము.అందుకే గ్లాసులో తాగితే మంచిదని అంటున్నారు.
మరి కొందరు కొబ్బరి నీటిని బాటిల్‌తో తీసుకొచ్చి.. ఫ్రిడ్జ్‌లో ఉంచి రోజంతా కొద్దికొద్దిగా తాగుతారు. ఇలా తాగడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. కొబ్బరి కాయ నుంచి నీళ్లు వేరు చేసిన 2 గంటలోపు తాగేయాలి. లేకపోతే నీరు పుల్లగా, రుచి మారిపోవడంతో పాటు కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలను కోల్పోతాము.పైగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయట.