సిగరెట్లు తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుందా..? నిజం ఏంటి?

ఉరుకులు పరుగుల జీవితంతో ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలామంది స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. ఆఫీసుల్లో పనిచేసే చాలా మంది టెన్షన్‌ను తగ్గించుకోవడానికి సిగరెట్లను ఆశ్రయిస్తారు. సరదాగా అలవాటు చేసుకుని చైన్ స్మోకర్స్‌గా మారిపోతున్నారు. అయితే నిజంగానే సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందా అంటే నో అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సిగరెట్లలో ఉండే నికోటిన్ మెదడును ప్రభావితం చేస్తుంది. దీంతో ఎవరైనా సిగరెట్ తాగినప్పుడు.. వారి బాడీలో నికోటిన్ .. డోపమైన్ అనే ఒక హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్లే హ్యాపీగా ఉన్నట్లు స్మోక్ చేసిన వ్యక్తి భావిస్తాడు. కానీ ఆ మనిషిలో నికోటిన్ ప్రభావం తగ్గగానే అంతకు మించి అశాంతి, మానసిక ఒత్తిడిని అనుభవిస్తాడు.

స్మోక్ చేయడం వల్ల కాసేపే మంచి అనుభూతి కలుగుతుంది.. కానీ అది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి సిగరెట్లు తాగే అలవాటు వల్ల టెన్సన్ తగ్గడం కాదు.. క్రమంగా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే నికోటిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆందోళన, నిరాశ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.

అయితే చాలా కాలంగా స్మోక్ చేస్తున్న వ్యక్తి సిగరెట్లు తాగడం మానేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అప్పటికే సిగరెట్లలో ఉండే నికోటిన్‌కి ఆ మనిషి అలవాటు పడిపోతారు. ఒక వ్యక్తి స్మోకింగ్ మానేయడానికి ప్రయత్నిస్తే, శరీరంలో నికోటిన్ లోపం ఏర్పడి దీనివల్ల చిరాకు, కోపం, అనేక ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఆ వ్యక్తి స్మోక్ మానేయాలని కోరుకున్నా కూడా మానేయలేడని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.