చాలామంది పచ్చి కొబ్బరిని తినడానికి ఇష్టపడరు. కానీ దానిలోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు దాహాన్ని తీర్చితే..కొబ్బరి క్రీమ్ కడుపు నింపుతుంది. చాలామంది వంటకాల్లో కూడా బాగా వాడతారు. స్వీట్లు, పచ్చళ్లతో పాటు కూరలలోనూ కొబ్బరి పొడిని వాడతారు. అయితే పచ్చికొబ్బరి తినటం వల్ల బరువు తగ్గటమే కాదు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందంటుని నిపుణులు అంటున్నారు.
వందగ్రాముల కొబ్బరిలో 350 వరకు కెలోరీలు ఉంటాయి. వీటిలో అధికభాగం అందులో ఉండే 30 గ్రాముల కొవ్వుపదార్థాల నుండే వస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కొబ్బరిలో ఉండే కొవ్వుపదార్థాల్లో దాదాపు తొంభైశాతం సాచ్యురేటెడ్ కొవ్వులే. సాధారణంగా సాచ్యురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి హానికరం. కానీ కొబ్బరిలో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులో మీడియం చెయిన్ ట్రైగ్లిసరైడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని పరిశోధనల ద్వారా తేలింది. ఇవి నేరుగా రక్తంలోకి చేరటం వల్ల శక్తిగా మారతాయి.
కొబ్బరిలో ఉండే కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయట. పచ్చికొబ్బరిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు.. త్వరగా అలసటకు గురయ్యేవారు తక్షణ శక్తికోసం కొబ్బరి తినటం మంచిది.ఆకలిని నియంత్రించడానికి, శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా పరిమిత మోతాదుల్లో కొబ్బరి తినవచ్చు. రోజూ కొద్దిగా కొబ్బరి తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ర్టాల్ కొంత తగ్గడమేకాక మంచి కొలెస్ర్టాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
ఒంట్లో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. థైరాయిడ్ సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి ముక్కలు, కొబ్బరితో చేసిన కుకీస్ వంటివి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. మితి మీరి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే అప్పుడప్పుడూ పచ్చి కొబ్బరి తిని ఈజీగా బరువు తగ్గించుకొమ్మని సలహా ఇస్తున్నారు.