బిజీబిజీ లైఫ్‌లో చాలామందికి తిండి తినే టైమ్ ఉండటం లేదు. ఉన్న కాస్త టైమ్ లో సూపర్ మార్కెట్ కు వెళ్లో.. లేదా ఆన్లైన్ లో గ్రోసరీస్ ఆర్డర్ ఇచ్చుకుని వాటితో కడుపు నింపుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ వల్ల ..అనారోగ్యాలను తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉప్పు, షుగర్ కంటెంట్, కొలెస్ట్రాల్ వల్ల జబ్బుల పాలవుతారని చెబుతున్నారు.
బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు, నూడుల్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు,ఉప్పు, చక్కెర ఎక్కువ ఉంటూ అల్ట్రా ప్రాసెస్ చేయబడతాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF లు) సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పదార్ధాలతో తయారు చేస్తారు. వాటిలో చాలావరకూ మన కిచెన్ లో వాడని పదార్ధాలే ఉంటాయి. ఎమల్సిఫైయర్‌లు, హ్యూమెక్టెంట్లు, డైస్, సంకలితాలు, ప్రిజర్వేటివ్‌లు, స్టెబిలైజర్లు వంటివి ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉంటాయి.
యుపీఎఫ్‌లు సహజంగా మన ఆరోగ్యానికి హానికరమని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. వీటిని తింటున్నపుడు ఆ టేస్ట్ ఇంకా తినాలనేపించేలా ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరుగడంతో పాటు.. వృద్ధులలో పెరుగుతున్న టైప్ -2 డయాబెటిస్, క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్, నీర్సం వంటి రోగాలు వస్తాయి. నేషనల్ న్యూట్రిషన్ సర్వే ప్రకారం ఐదు నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 56% మంది పిల్లలు కార్డియో-మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నారని తేలింది.
యూరోమోనిటర్ డేటా ప్రకారం, భారతదేశంలో UPF ల అమ్మకం 2005 లో తలసరి రెండు కేజీల నుంచి 2019 లో ఆరు కిలోలకు పెరిగింది. అది 2024 నాటికి ఎనిమిది కిలోలకు పెరుగుతుందని అంచనా కూడా ఉంది. అదేవిధంగా, బెవరెజ్స్ సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. 2005 లో 2 లీటర్లు ఉండగా.. అది 2019కి 8లీటర్లకు చేరింది. దీంతో ఈ సేల్స్ 2024 నాటికి 10 లీటర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రీయ ఆధారాలతో ప్యాకెట్ ఫుడ్స్ లో అధిక కొవ్వు, చక్కెర లేదా ఉప్పు కంటెంట్ ను నిరూపించి.. దీనిద్వారా మార్కెట్ ను నియంత్రించొచ్చు.మనం కొనుక్కునే ప్యాకెట్లపై FOPL ముద్రించాలి. దీనివల్ల ఫుడ్ సమాచారం అంతా వినియోగదారునికి తెలుస్తుంది. వీటిలో ఉన్న పదార్థాలు కట్-ఆఫ్ పాయింట్ కంటే ఎక్కువగా ఉందని చెప్పడం వల్ల వినియోగదారునికి ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం ఇవన్నీ వినియోగదారుడు తెలుసుకోవాల్సిన హక్కు ఉందని సుప్రీంకోర్ట్ కూడా గతంలో చెప్పింది..