ఒకప్పుడు ఇంటి పని, పిల్లల పని మాత్రమే చూసుకునే మహిళలు ఆర్థిక స్వాతంత్రం కోసం, ఇంటికి చేదోడువాదోడుగా ఉండటం కోసం ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టైమ్ సరిపోకఇంటి పని, ఆఫీసు బాధ్యతలతోనే సతమతమవుతూ.. తమ ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్దచూపరు. కానీ, 40 ఏళ్ల తర్వాత ప్రతీ మహిళా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు.
40ఏళ్ల తర్వాత మహిళల్లో సంభవించే మార్పులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 40 ఏళ్ల పైబడిన మహిళలు ఎముకల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బోన్ వీక్ అయితే చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోయి మంచానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
40ఏళ్లు దాటాక తర్వాత నుంచి ఎముకల ఆరోగ్యం విషయంలో.. మహిళలు ఎక్కువ శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం. మహిళలలో వయసు పెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతుంటాయి. దీంతో వీరికి ఎక్కువ శాతం బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తరచూ ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. . 40 ఏళ్లకు చేరాక ఎముకల దృఢత్వంపై మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీనికి అవసరమైన ఆహారాలను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు మహిళల డైట్‌లో తప్పకుండా ఉండాలి. కాల్షియం వల్ల ఎముకల బలం, సాంద్రత పెరుగుతాయి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, సోయా బీన్స్, నట్స్ వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తమ రెగ్యులర్ డైట్‌లోకి మార్చుకోవాలి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఎముకల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే.. ఎముకలు డ్యామేజ్ అయ్యే ఆస్టియోపోరోసిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు.