జలుబు ఉన్నా, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చినా వెల్లుల్లి రెబ్బలు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అంటారు. అంతేకాదు వెల్లుల్లి గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉండటంతో..ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ బెస్ట్ అని అద్యయనాలు చెప్పాయి.
వేడి వేడి అన్నంతో పచ్చి వెల్లుల్లి రెబ్బను కలిపి తింటే శరీరం దృఢంగా ఉంటుంది. అయితే అందరూ పచ్చి వెల్లుల్లిని తినకూడదని ఆయుర్వేదం చెబుతుంది. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి వెల్లుల్లి రెబ్బను పచ్చిగా తినడం చాలా మంచిది. కానీ అదే వెల్లుల్లిని వేసవి కాలంలో తినడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయట. కాబట్టి తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
కడుపు పూతతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదట. పచ్చి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లకు కాలేయంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా అడ్డుకునే గుణం ఉంది. అయితే పచ్చి వెల్లుల్లిని తరచూ తినడం వల్ల కడుపులో చికాకు, వాంతులు, లూజ్ మోషన్స్ వస్తాయి. హై బీపీని తగ్గించడంలో పచ్చి వెల్లుల్లి రెబ్బలు ది బెస్ట్ గా పనిచేస్తుంది. కానీ రక్తహీనత, లో బీపీ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తింటే రక్తపోటు స్థాయి మరింత తగ్గే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే గర్భిణీలు, పాలిచ్చే మహిళలు వెల్లుల్లిని పచ్చిగా తినకూడదు. అంతేకాదు పచ్చి వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో, జీర్ణం కావడం అంతే కష్టమని నిపణులు చెబుతున్నారు. అందుకే చిన్న పిల్లలకు, వృద్ధులకు పచ్చి వెల్లుల్లిని తినిపించకూడదు. గార్లిక్‌కు రక్తాన్ని పలుచగా చేసే గుణం ఉంది కాబట్టి బ్లడ్ థినర్స్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని టచ్ కూడా చేయకూడదట.
పచ్చి వెల్లుల్లిని తేలికగా జీర్ణం చేసుకునే వారికి ఒక వరమే. అయితే ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు మాత్రం పచ్చి వెల్లుల్లిని జీర్ణం చేసుకోలేరు. దీన్ని తినడం వల్ల కావాల్సిన ప్రయోజనాలు పొందే బదులు జీర్ణక్రియ సమస్యలు ఎక్కువ వుతాయి. వివిధ చర్మ వ్యాధులకు పచ్చి వెల్లుల్లి తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలా అని పచ్చి వెల్లుల్లిని మాత్రం చర్మంపై రుద్దకూడదు. దీని వల్ల లేనిపోని అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.