మనలో చాలామంది కర్రీలో కాస్త సాల్ట్ తక్కువ అయినా అస్సలు కాంప్రమైజ్ అవరు. నిజానికి మనం ఎక్కువ ఉప్పు తింటే.. అంటే 10గ్రాముల కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తంలోనే ఉండిపోతుంది. దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది.
ఈసారి గుండె గట్టిగా కొట్టుకుని.. ఒక స్పందనలో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది.ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. కానీ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా కొట్టుకుంటుంది.అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రంలోంచి వెళుతుంది.
దానికి మూత్రపిండాలు వాటి సామర్ధ్యాన్ని దాటి మూడు నాలుగు రెట్లు పనిచేయాలి. అలా ఎక్కువ కాలం పనిచేయటం కుదరదు. ఈలోగా గుండె బలంగా కొట్టడానికి దాంట్లో ఉన్న కండరం సరిపోదు అందువలన కొత్త కండరాన్ని గుండె తయారు చేసుకుని దిట్టంగా తయారవుతుంది. అయితే అలా లావు అవుతూ గుండె జఠరికలో ఉండే చోటు తగ్గిపోయి గుండె పంపు చేసే రక్తం తగ్గిపోతుంది. అలాగే గుండె పనిచేయాలంటే గుండెకీ రక్తం కావాలి కాబట్టి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అంతటి మందమైన రక్తాన్ని గుండెకి అందించలేవు. అపుడు మనం ఏమాత్రం గుండె మీద భారం వేసినా, అంటే పరిగెత్తినా, కడుపునిండా తిన్నాచివరికి శృంగారంలో పాల్గొన్నా గుండెకి రక్తం సరిపోక ఛాతీ లో నొప్పి వస్తుంది. ఇంకాస్త ఎక్కువైతే గుండెపోటు వస్తుంది.
మెదడులో రక్త నాళాలు చాలా చిన్నవి మరియు సున్నితమైనవి. ఇవి కొన్ని సార్లు ఈ ఒత్తిడికి మూసుకుపోయి ఆ రక్తనాళం వెళ్లే మెదడు కణజాలం రక్తం అందక చనిపోతుంది. అయితే అలా చనిపోయేవి చుక్కంత ఉంటాయి. కానీ ఒక పది ఇరవై ఏళ్లలో ఈ చుక్కలన్నీ కలిసి మెదడు పనితీరు బాగా దెబ్బతీసి మతిమరుపు, డెమెన్షియా మొదలైన ఇబ్బందులు వస్తాయి. ఇవి కాక ఒకేసారి రక్త పీడనం పెరిగి మెదడులో రక్తనాళం పగిలి అక్కడ రక్త స్రావం అయ్యి పక్షవాతం రావచ్చు.. లేదా మెదడులో ఒకేసారి ఒత్తిడి పెరిగి ఊపిరి ఆగొచ్చు.
ఈలోగా మూత్రపిండాలు కూడా బాగా పని చేసి చేసి అలసిపోయి ఇక పనిచేయటం మానేస్తాయి. దాంతో రక్తం లో నీరు ఒంట్లో కి చేరి ఒళ్లు ఉబ్బుతుంది.
అలాగే యూరియా, క్రియాటినిన్ లు పెరిగి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులు ఊది ఊది అలసిపోయి ఇక ఊపిరి తీయటం మానేస్తాయి. ఉప్పు తినడం వల్ల ఇంత భారీ నష్టం జరుగుతుందన్న విషయం చాలామందికి తెలీదు. ఉప్పు రోజుకి ఐదు గ్రాములకి మించి తినకూడదు కానీ మనం పది గ్రాములు తింటాం.
ఉప్పు తక్కువ తినటానికి కొన్ని చిట్కాలు..
కూర, చారులో ఉండే ఉప్పు చాలు. మళ్లీ మజ్జిగలో సరిపోలేదని అన్నంలో వేసుకోకూడదు. సాల్ట్ కు బదులు నిమ్మకాయ వాడొచ్చు. వండేటప్పుడు తగినంత ఉప్పు కాకుండా తక్కువ వేస్తే… మెల్లగా అలవాటు అవుతుంది.
ఆవకాయ, నిల్వపచ్చళ్లు లేనిదే తెలుగువాళ్లకు ముద్ద దిగదు. కానీ మూత్రపిండాలు అంత సాల్ట్ తినడానికి ఒప్పుకోవు. కాబట్టి వారానికి ఒకసారి తినడం అలవాటుగా మార్చుకోవాలి.
చిప్స్ ప్యాకెట్లలో కనిపించని గాలి ఎంతో కనిపించని ఉప్పు కూడా అంతే ఉంటుంది. అలాగే, ఫ్రెంచి ఫ్రైస్, పాప్ కార్న్ కూడా. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి.