ప్రతి ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రపంచ న్యుమోనియా దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా గురించి అవగాహన పెంచడానికి, దీనిని నివారించడానికి, చికిత్స చేసే మార్గాలను ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించబడిందని డబ్యూహెచ్ఓ చెబుతోంది.నిజానికి న్యుమోనియా అనేది ఒక ప్రాణాంతక వ్యాధి, ఇది ఊపిరితిత్తులలో తేమ, వాపు వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులు, తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారికి ఎక్కువ ప్రమాదకరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం, న్యుమోనియా ప్రపంచంలో పిల్లల మరణానికి కారణమయ్యే మొదటి దశగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది చిన్నపిల్లలు ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. బాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వివిధ సూక్ష్మజీవులు న్యుమోనియాకు కారణంగా ఉన్నాయి. అయితే, ఈ వ్యాధి నివారించడానికి సరైన వ్యాక్సినేషన్, మంచి ఆహారం, శుభ్రమైన వాతావరణం, సమయానికి వైద్యం అందించడం అవసరమని డబ్యూహెచ్ఓ చెబుతోంది.
న్యుమోనియా వ్యాధి నివారణలో వాయు కాలుష్యాన్ని కూడా గుర్తించడం చాలా అవసరం. వాయు కాలుష్యం న్యుమోనియాను మరింత ఎక్కువ చేస్తుంది. గృహ వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. పొగ, ధూళి, వంటకాల నుంచి వెలువడే కాలుష్యాలు శరీరాన్ని బాగా ప్రభావితం చేసి.. న్యుమోనియాకు బారినపడే అవకాశాలు పెరిగిపోతాయి.
ప్రపంచ న్యుమోనియా దినోత్సవం రోజు.. వాయు కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టే ఒక మంచి సమయంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు అందరి ఇంట్లో ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవడం ద్వారా వాయు కాలుష్యాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అలాగే లోకల్ లీడర్స్ తో అధికారులు, సిబ్బంది, స్థానికులు సంప్రదించి, సమాజంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం, ప్రజా అవగాహన పెంచడానికి కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.