ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వినిపించిన వార్తలు.. ఇటు ఫ్యాన్స్‌తో పాటు అటు బీసీసీఐలోనూ పెద్ద కలకలమే రేపింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందంటూ వినిపించిన వార్తలతో ఎవరా తెర వెనుక ఉన్న బిజినెస్ మ్యాన్ అంటూ ఆరాలు, ఎంక్వైరీలు కూడా మొదలయ్యాయి.కాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇప్పటికే లీగ్‌లో సగం మ్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైన ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. 34 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు టాప్ ప్లేసులో నిలవగా, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇలాంటి సమయంలోనే వినిపించిన ఈ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐలోనూ కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ బిజినెస్ మ్యాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా క్రికెట్ లవర్స్ కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై రాచకొండ సీపీ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ పంటర్.. ఐపీఎల్ క్రికెటర్లను మ్యాచ్ ఫిక్సింగ్‌లోకి లాగుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఫిక్సింగ్ కోసం ఓ బిజినెస్‌మ్యాన్ క్రికెటర్స్ కు ఖరీదైన గిఫ్ట్‌లు, జ్యువెలరీ ఆఫర్ చేస్తున్నారని , అంతేకాకుండా ఐపీఎల్ టీమ్‌లు బస చేసే హోటళ్లకు వెళ్లి మరీ అక్కడ లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. ఎవరా బిజినెస్ మ్యాన్ అనేదిశగా ఎంక్వైరీలు చేసి చివరకు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు హైదరాబాద్ వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న కథనాలు అవాస్తవమంటూ రాచకొండ సీపీ సుధీర్ బాబు తేల్చేశారు. అంతేకాదు బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం కానీ అలెర్ట్ రాలేదని సీపీ చెప్పారు. క్రిక్‌బజ్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని, ఉప్పల్ స్టేడియంకు గాని ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు గానీ, అనుమానితులు ఎవరూ కూడా వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆలాంటి ప్రలోభాలకు ఎవరు పాల్పడలేదని చెప్పారు. పోలీసుల వివరణతో ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని క్రికెట్ లవర్స్ ఊపిరి పీల్చుకున్నారు.