అండర్‌-19 వరల్డ్ కప్ విజేత బంగ్లాదేశ్‌

Bangladesh Wins Under 19 World Cup, ICC U-19 World Cup final, ICC Under 19 World Cup Final, ICC Under-19 Cricket World Cup, ICC Under-19 World Cup, India U19 vs Bangladesh U19, India Vs Bangladesh, Mango News Telugu, U19 World Cup 2020, Under 19 World Cup Final

దక్షిణాఫ్రికలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరిగిన ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ జట్టుపై 3వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్‌ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ విజయాన్ని అందుకోవడానికి 15 పరుగులు దూరంలో ఉన్నపుడు వర్షం పడడం వలన కొద్దిసేపు ఆటకు అంతరాయం కలగడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ లక్షాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. దీంతో 30 బంతుల్లో 7పరుగులు చేయాల్సి ఉండగా, బంగ్లా ఆటగాడు రకీబుల్‌ హసన్‌ ఫోర్ కొట్టడంతో బంగ్లాదేశ్‌ సంచలన విజయాన్ని నమోదు చేసింది. పర్వేజ్‌ ఇమాన్‌(47: 7×4), కెప్టెన్ అక్బర్‌ అలీ(43: 77 4×4, 1×6) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు, సుషాంత్‌ మిశ్రా 2 వికెట్లు, జైశ్వాల్‌ 1 వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(88: 8×4, 1×6) పరుగులతో మరోసారి రాణించగా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ(38:3×4), ధ్రువ్ జురెల్ (22) పరుగులతో తమవంతు సహకారం అందించారు. మిగిలిన బ్యాట్స్‌మన్‌ అంతా సింగిల్ డిజిట్ స్కోర్లతో దారుణంగా విఫలమయ్యారు. మ్యాచ్ ప్రారంభం నుంచే బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌ మూడు, తన్జిమ్‌ హసన్‌ రెండు, శౌరిఫుల్‌ ఇస్లామ్‌ రెండు, రకీబుల్‌ హసన్‌ ఒక వికెట్‌ తీశారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించి కప్ గెలుచుకోవడంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మరోవైపు టోర్నీ ఆసాంతం అపజయం లేకుండా రాణించి, ఫైనల్లో పోరాడిన కూడా ఓడిపోవడంతో భారత్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here