ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యులు యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓ షూ మాకర్‌తో పలు కీలక చర్చలు జరిపారు. ఈ చర్చలు విజయవంతంగా ముగియడం రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెరిచింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల యూనిలివర్ కంపెనీకి కలిగే ప్రయోజనాలను సీఎం రేవంత్ స్వయంగా షూ మాకర్, చీఫ్ సప్లయి చైన్ ఆఫీసర్ విలియమ్ ఉయిజన్‌లకు వివరించారు. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని, సౌత్ ఇండియాకు గేట్‌వేగా తెలంగాణ విశేష పాత్రను పోషిస్తోందని తెలిపారు.
తెలంగాణ ఐటీ విజన్-2050లో భాగంగా యూనిలివర్‌కు పూర్తి మద్దతు ఇస్తామని, వాణిజ్యాన్ని సులభతరం చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. చర్చల ఫలితంగా యూనిలివర్ సంస్థ తెలంగాణలో రెండు యూనిట్‌లను నెలకొల్పేందుకు అంగీకరించింది.
కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్, మరోవైపు బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. వినియోగ వస్తువుల తయారీలో యూనిలివర్ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ కావడంతో, ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా నిలవనున్నాయి.
చర్చల అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు తెలంగాణ ఆర్థిక రంగానికి ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. “యూనిలివర్ కంపెనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది,” అని సీఎం రేవంత్ వెల్లడించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వీ. శేషాద్రి, సీఎంఓ సభ్యులు ఈ. విష్ణు వర్ధన్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ బీ. అజిత్ రెడ్డి పాల్గొన్నారు.