
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది రేవంత్ సర్కార్. రూ.2 లక్షల 95 వేల కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి.జులై 25న మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురానుంది.
మరోవైపు.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు చేయలేదంటూ బుధవారం తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ టాపిక్‌పై తాము చర్చించబోమంటూ బీజేపీ నేతలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అధికార పార్టీ, విపక్ష బీఆర్ఎస్ మాత్రమే దీనిపై డిస్కస్ చేశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని సభలో హరీష్ రావు ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ అంటే.. అందరం కలిసి దీక్ష చేద్దామని, ఆ దీక్షకు మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనిపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 27న జరుగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ తన ఆస్తులు అమ్మి తెలంగాణకు డబ్బులివ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ నుంచే లక్షలకోట్ల పన్నుల నిధులు కేంద్రానికి వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. అందులో నుంచే కొన్ని నిధులు తిరిగి తమకు రావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సిన ఫండ్స్ మాత్రమే అడుగుతున్నామని.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై చర్చ జరుపుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సభకు రాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అయితే తమకు సమాధానం చెప్పాలని.. కేసీఆర్ దాకా ఎందుకని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో డైలాగ్ వార్ పీక్స్‌కి చేరింది. కాగా.. ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తెలంగాణ వాసుల కలలు ఎంతవరకూ తీర్చుతాయో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY