నేటినుండి 45 రోజుల్లో.. రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో అత్యాధునిక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సందర్భంగా ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి..
రైతు సంక్షేమం – రైతు భరోసా నిధుల విడుదల:
-
తొలి విడత జమ: ఈ వేదిక మీదుగా రైతు భరోసా పథకం కింద 70 లక్షల మంది రైతులకు రూ. 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ప్రస్తుతం యాసంగి సీజన్‌కి సంబంధించి తొలి విడతగా సోమవారం రూ. 3,600 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు.
-
దశలవారీగా చెల్లింపులు: మిగిలిన నిధులను రాబోయే 45 రోజుల్లో రెండు విడతలుగా (ఏప్రిల్ 10 లోపు ఒకసారి, ఏప్రిల్ నెలాఖరులోపు మరోసారి) నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని భరోసా ఇచ్చారు.
-
పెద్దన్న పాత్ర: తాను రైతులకు ఒక ‘పెద్దన్న’లా ఉండి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై విజన్:
-
దేశంలోనే రికార్డు: నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కేవలం 16 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించామని, ఇది దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన పరిశ్రమ అని సీఎం వెల్లడించారు.
-
మల్లేషియా టెక్నాలజీ: ఈ ఫ్యాక్టరీలో గంటకు 30 నుంచి 180 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉందని, దీని ద్వారా రైతులకు చెల్లింపులు కేవలం 3 రోజుల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
-
రిఫైనరీకి శంకుస్థాపన: కేవలం ఆయిల్ తీయడమే కాకుండా, దాన్ని శుద్ధి చేసేందుకు రూ. 80 కోట్లతో రిఫైనరీ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. దీనివల్ల తెలంగాణ నుంచే ‘విజయ’ బ్రాండ్ పేరుతో నేరుగా రిఫైన్డ్ ఆయిల్ మార్కెట్లోకి వస్తుందని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:
-
ఎన్నికల వరకే రాజకీయం: రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలని, ఎన్నికలు ముగిశాక అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.
-
కేంద్రంతో సమన్వయం: రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఎరువుల కోటాను పెంచేలా ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తామని, ఇందుకోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని కోరారు.







































