మున్సిపల్ ఎన్నికలు: నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Conducts Zoom Meeting With In-charges on Municipal Elections Strategies

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు రానున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో జూమ్ మీటింగ్ (Zoom Meeting) నిర్వహించారు సీఎం. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కీలక దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక సూచనలు, సలహాలు:

ఐక్యంగా ముందుకు సాగాలి:

  • మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు అసంతృప్త నేతలను బుజ్జగించి, పార్టీ బలపరిచిన అభ్యర్థులకే అందరూ మద్దతు ఇచ్చేలా చూడాలని ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు.
  • రెబల్ అభ్యర్థులు బరిలో ఉంటే అది పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందని, అటువంటి వారిని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరింపజేయాలని సూచించారు.

ప్రభుత్వ అభివృద్ధి పనులే ఆయుధాలు:

  • గడిచిన కొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలని సీఎం సూచించారు.
  • ఆరు గ్యారంటీల అమలులో సాధించిన పురోగతిని వార్డు స్థాయి ఓటర్లకు వివరించాలని చెప్పారు. ముఖ్యంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రుణమాఫీ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.
  • పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

విజయమే లక్ష్యంగా కార్యాచరణ:

  • ప్రతి పురపాలక సంఘం మరియు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
  • అభ్యర్థుల గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
  • ప్రచారంలో మంత్రులు మరియు కీలక నేతలు చురుగ్గా పాల్గొనాలని, ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పటిష్టం చేయాలని సూచించారు.
  • ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా..

మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ జూమ్ మీటింగ్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, ఇందులో సాధించే విజయమే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది అని ఆయన నొక్కి చెప్పారు.

విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ, అభివృద్ధి ఎజెండాతో ఓటర్ల ముందుకు వెళ్లాలని చేసిన సూచనలు పార్టీ నాయకులకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రచార పర్వం ఊపందుకుంటున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

పోలింగ్ వివరాలు..

కాగా, తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే జీహెచ్‌ఎంసీకి ఈ ఎన్నికలనుండి మినహాయింపునిచ్చారు. ఈనెల 28న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ జనవరి 30తో ముగిసింది.

ఈరోజు (శనివారం) నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 13న వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here