తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. అసెంబ్లీలో జరుగుతున్న రగడపై దృష్టి సారించారు.దీంతో తమ పార్టీ తరపున అసెంబ్లీలో మహిళ కీలక పదవిలో ఉంటే సభలో మాట్లాడే ఛాన్స్ ఇస్తారని ఆయన భావిస్తున్నారట.దీనికోసం ఇప్పటికే నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు ఆ పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూడునాలుగు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ సబిత ఇంద్రారెడ్డి అన్నచందంగానే మారింది. ఈ నేతలిద్దరి మధ్య అంతర్గత విషయాలు అసెంబ్లీ వేదికగా బయటపడ్డాయి. తనకు మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదంటూ సబిత పదేపదే చెప్పుకొస్తుంటే..దానిని కొట్టి పడేస్తూ రేవంత్ వర్గీయులు సమాధానిమిస్తున్నారు. అయితే అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలను క్షుణ్నంగా గమనిస్తున్న కేసీఆర్ తాజాగా సబితకు కీలక పదవి ఇవ్వడంపై దృష్టి సారించారట.
మరోవైపు ఎస్సీల వర్గీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పును, దానిపై రాజకీయ నేతల స్పందనపై కేసీఆర్ ఆరా తీశారట. ప్రస్తుతం నియామకాల నుంచి ఎస్సీ వర్గీకరణ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఇదే సభలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ శాసనసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని పెట్టింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలను అప్పటి ప్రభుత్వం బహిష్కరించిన విషయం తెల్సిందే.
తాజాగా తెలంగాణలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..సబిత ఇంద్రారెడ్డికి సభలో కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎదుర్కోవాలంటే సబిత రైట్ పర్సన్ అని ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
అంతేకాదు ఒకవేళ అదే జరిగితే కేటీఆర్, హరీష్‌రావు మాటేంటన్న దానిపై కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి కీలక పదవి ఇచ్చినా కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు వస్తాయని, దానికి బదులు సబితకు ఇస్తేనే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. దీనిపై అతి త్వరలోనే సభ్యు లందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకున్నారంట కేసీఆర్.