హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను రేవంత్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు అంటే ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు 740 మీటర్ల వరకూ అతిపెద్ద అండర్ గ్రౌండ్ పాసేజ్ నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్, ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్.. జూబ్లీ చెక్‌పోస్ట్ కంటే ముందు ఉండే అండర్‌పాస్ నుంచి సిగ్నల్ ప్రాబ్లెమ్స్ లేకుండా ఎంచక్కా ప్రయాణించే వీలు కలగనుంది.
మూడు లేన్లుగా ఈ అండర్‌పాస్ కన్‌స్ట్రక్షన్ డిజైన్ చేశారు. గతంలో నిర్మించిన అండర్‌పాస్‌లలో మెజార్టీ 200-300 మీటర్లు మాత్రమే ఉండగా తాజాగా 740 మీటర్లతో డిజైన్ చేసిన కేబీఆర్ పార్కు వద్ద నిర్మించే అండర్‌పాస్ అతిపెద్దది కాబోతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా, మెజార్టీవి 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నవే ఉన్నాయి.
వాహనదారులకు సిగ్నల్ సమస్యలు లేకుండా జంక్షన్ల వారీగా మల్టీపుల్ మార్గాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించిన అధికారులు… జూబ్లీ చెక్‌పోస్ట్ దగ్గర మాత్రం రెండో లెవల్‌లో ఓ వంతెన ప్రతిపాదించారు.కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ చౌరస్తా వద్ద 192 కోట్ల రూపాయలతో రెండు అండర్‌పాస్‌లు, ఓ వంతెన ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్ వైపు వెళ్లనున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఫ్రీ లెఫ్ట్ ద్వారా యూసుఫ్‌గూడ వైపు అలాగే బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సిన వాహనాలు మాత్రం అండర్‌పాస్ వినియోగించాల్సి ఉంటుంది.
జూబ్లీచెక్‌పోస్ట్ వద్ద రెండు వంతెనలు, ఓ అండర్‌పాస్ నిర్మించబోతున్నారు. దీనికోసం 229 కోట్లు రూపాయలు అవసరమని అంచనా వేశారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -36 వైపు మూడు లేన్ల చొప్పున రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించడానికి ఆరు లేన్ల వంతెన అందుబాటులోకి రాబోతుంది. రోడ్ నెంబర్-45 వైపు నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు వెళ్లడానికి మూడు లేన్ల అండర్‌పాస్, యూసుఫ్‌గూడ వైపు వాహనాల కోసం మరో అండర్‌పాస్‌ను ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్-45 వైపు వెళ్లే వెహికల్స్ కోసం సెకండ్ లెవల్‌లో రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు.
బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సిగ్నల్ దగ్గర ఓ అండర్‌పాస్, ఓ వంతెనను 83 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్ నుంచి మహారాజ అగ్రసేన్ చౌరస్తా వైపు వెళ్తాయి. తెలంగాణ భవన్ నుంచి వెళ్లే వాహనాలు వంతెన మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-10, రోడ్ నంబర్-1 వైపు వెళ్లొచ్చు.మహారాజ అగ్రసేన్ చౌరస్తా వద్ద రూ.110 కోట్లతో ఓ అండర్‌పాస్, వంతెన ప్రతిపాదించారు. కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్ మీదుగా ఫిల్మ్‌నగర్ చౌరస్తా వైపు వెళ్లాలి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12 నుంచి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఫిల్మ్‌నగర్ చౌరస్తాకు వెళ్లొచ్చు.
ఫిల్మ్‌నగర్ చౌరస్తా వద్ద అండర్‌పాస్, ఓ ప్లై ఓవర్ ను 115 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. దీంతో మహారాజ అగ్రసేన్ చౌరస్తా వైపు నుంచి వచ్చే వెహికల్స్ అండర్‌పాస్ నుంచి జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వైపు వెళ్లాలి. ఫిల్మ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు మాత్రం ప్లై ఓవర్ మీదుగా మహారాజ అగ్రసేన్ జంక్షన్ వైపు వెళ్లడానికి అవకాశం కలుగుతుంది.
రోడ్ నంబర్ -45 జంక్షన్ వద్ద 97 కోట్ల రూపాయలతో ఓ అండర్‌పాస్, ప్లై ఓవర్ నిర్మాణం ప్రతిపాదించారు. జర్నలిస్ట్ కాలనీ సిగ్నల్ వైపు నుంచి అండర్‌పాస్ ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లొచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి వచ్చే వాహనదారులు ప్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వెళ్లొచ్చు.