తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు, కార్యక్రమాల ద్వారా ఇటీవల వరుస వివాదాలకు కారణమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం సినీ ప్రముఖులపై చేసిన విమర్శల కారణంగా ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో, నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు జరగనున్నది.
ఇదిలా ఉండగా, కొండా సురేఖతో సంబంధిత కొన్ని వీడియోలు గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌డే వేడుకలపై చర్చిస్తూ, బిర్యానీలు, బీర్ పార్టీ గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది.
వీడియోలలో సురేఖ మాట్లాడుతూ, “ఈ రోజు మా అందరికీ పండుగ. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నము.. మా టీమ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయండి. బీర్ ఉంటే సంతోషం కదమ్మా,” అని వ్యాఖ్యానించినట్లు స్పష్టమవుతుంది. మరో వీడియోలో, “ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వారికి మందు ఎక్కువ,” అని వ్యాఖ్యానించగా, మరొక వీడియోలో బిర్యానీలు, సల్లవడుడు గురించి చర్చిస్తూ కనిపించారు. ఈ వ్యాఖ్యలతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియోలపై నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు సురేఖను టార్గెట్ చేస్తూ, ఇది రేవ్ పార్టీనా? డ్రగ్స్ పార్టీనా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు సురేఖ ఇంట్లో పోలీసులు సోదాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కుమార్తె సుస్మిత వివరణ
ఈ వివాదం మధ్యలో మంత్రి కుమార్తె సుస్మిత స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. ఆమె ప్రకటనలో, “మా కుటుంబ పార్టీ మాత్రమే జరిగింది. మా అమ్మ తన సిబ్బందిని ప్రేమతో చూస్తుంది. మా పాప పుట్టినరోజు సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో విందు ఏర్పాటు చేశాం. అందులో ఎలాంటి నిషేధిత పదార్థాలు లేవు. మద్యం వాడకం బహిరంగంగానే చెప్పాం. ఎలాంటి రహస్యం లేదు,” అని పేర్కొన్నారు.
సుస్మిత విడుదల చేసిన లేఖలో, ఇది కుటుంబ సమూహం మాత్రమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ ఘటనను వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. “నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదు, మనతో నడిచేవారి బాగోగులు చూసుకోవడం,” అని ఆమె తమ తల్లి మార్గదర్శకత్వాన్ని రక్షిస్తూ చెప్పారు.
సురేఖ పుట్టినరోజు వేడుక వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కూడా దుమారం రేపుతోంది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీలాంటి వివాదాలు గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సురేఖ ఇంట్లో జరిగిన కుటుంబ వేడుక వీడియోలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీస్తున్నాయి. ఇలాంటి వీడియోలు, వివరణలు, విమర్శలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఈ వివాదంపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Is it Rave party at @KondaSurekha 's house❓
Party more, Dance more, 💃
to have more Liquor..🍻
Liquor will be arranged fully 🥃
she's saying in that video..😳Now will you send your police to her house @TelanganaDGP ❓
— ARPITHA PRAKASH (@ARPITHABRS) November 21, 2024