తెలంగాణలో వివాదం రేపిన కంచ గచ్చిబౌలిలోని భూములపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిపి..ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీజీ ప్రభుత్వం స్పందించి దీనిపై ఓ కమిటీ వేసింది. మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కంచ గచ్చిబౌలి వివాదంపై సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు, సమాధానాలు వెతకడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో సంబంధం ఉన్న వారితో కమిటీ సభ్యులు సంప్రదింపులు జరపనున్నారు. అనంతర తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
కాగా కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు.
నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన 400 ఎకరాలలో ఇప్పటికే 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చిందని చెప్పిన సుప్రీంకోర్టు.. తెలంగాణ సీఎస్‌పై సీరియస్ అయింది. అంత అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని గట్టిగా ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను ఎందుకు తొలగించారని చీవాట్లు పెట్టింది పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా అని అడిగిన సుప్రీంకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం ఆ బాధ్యత సీఎస్‌దేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇటు కంచ గచ్చిబౌలి భూముల్లో ఏప్రిల్ నెల 7 వరకు చెట్లు కొట్టేయవద్దని ..తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసి..విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ముగ్గురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ..ఇప్పుడు ఎలాంటి నివేదిక ఇవ్వబోతోందనేది కూడా కీలకంగా మారింది.