మరింత పెరిగిన ఎండలు..అల్లాడుతున్న జనాలు

ఇటీవల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలలో తేడా వచ్చినా మళ్లీ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి .భానుడి భగభగలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రెండు రోజులుగా మాడు పగిలే ఎండలతో తెలంగాణ వాసులు అల్లాడి పోతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను టార్చర్ పెడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.

దీనికి తోడు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజురోజుకు గాలిలో తేమ శాతం పడిపోతుంది. దీంతో తీవ్రమైన వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా గాలిలో తేమ ఉంటే కొంత చల్లదనం ఉంటుందని..కానీ ఈసారి హైదరాబాద్‌లోనూ భిన్నమైన వాతావరణం కనిపిస్తుందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు.

ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా తేమ పడిపోతే మాత్రం వేడి ఎక్కువగా అనిపిస్తుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో భరించలేనంత వేడి వాతావరణం కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో గాలిలో 26 శాతం తేమ మాత్రమే నమోదయింది. కాగా ఈ ఆదివారం సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా..తేమ శాతం బాగా పడిపోవడంతో నగర ప్రజలు అల్లాడిపోయారు. ఓవైపు మండే ఎండలు, భరించలేనంత ఉక్కపోత ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఇలా తేమ శాతం తగ్గిపోవడానికి నగరంలో ఆధునీకరణ పేరుతో చెట్లను నరికివేయడం, కాలుష్యం పెరగడం, నీటి వనరులు లేకపోవటం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. కాగా సోమవారం కొన్నికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులతో పాటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం, పుచ్చకాయ వంటి నీటి శాతం ఉన్న పండ్లు తినడం, కొబ్బరినీళ్లు, నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.