భాగ్యనగరాన్ని చార్‌సౌ షహర్ అని ముద్దుగా పిలుచుకుంటారు చరిత్ర తెలిసినవారు. కానీ డిసెంబర్ 31 న ఒక్క రాత్రిలోనే డ్రంకెన్ డ్రైవ్‌ల కేసులు మాత్రం హజార్ మార్క్‌ను దాటేశాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, హైదరాబాద్‌లో మద్యాన్ని ఏరులై పారించారు. తాగి వారి మానాన వారుండి ఎంజాయ్ చేస్తే ఓకే కానీ.. బాధ్యత లేకుండా రోడ్డెక్కి పోలీసులకే సవాల్ విసిరారు. పెగ్గు పెగ్గుకీ పెరిగిన మత్తు లెక్కలు ఎలా రికార్డ్ అయ్యాయో, రికార్డు స్థాయిలో వచ్చిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు చెప్పకనే చెబుతున్నాయి.
పోలీసులు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా తాగుబోతులు మాత్రం డోంట్ కేర్ అనే అన్నారు. పీకలదాకా తాగడమే కాదు..తాగి రోడ్డెక్కి మరీ తిరిగారు. ఈ ఏడాది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటామని పోలీస్‌లు పదేపదే హెచ్చరించినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా కొత్త సంవత్సరానికి మత్తుగా స్వాగతం పలికారు. వాళ్ల ఏరియాలో డ్రంకెన్ డ్రైవ్ ఉండదనుకున్నారో.. పోలీసోళ్లు కనిపించగానే పక్క సందులోంచి ఎస్కేప్ అవ్వొచ్చనుకున్నారో ఏమోకానీ బ్లైండ్‌గా బండెక్కి అడ్డంగా బుక్కయిపోయారు.డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి దాదాపు 11వందల 84 మందిపై కేసులు పడటంతో..లైట్ తీసుకున్న బ్యాచ్ అంతా ఇప్పుడు వారిపై కేసులు పడేసరికి కిక్కు దిగి బోరుమంటున్నారు.
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు ఏమాత్రం లెక్కచేయలేదు. ఎప్పటిలాగానే డ్రింక్ చేసి వాహనాలెక్కి మరీ రెచ్చిపోయారు . గత రాత్రి పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 11వందల 84 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. జోన్‌ల వారిగా చూస్తే.. ఈస్ట్ జోన్‌లో ఎక్కువగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు.. సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు నగరవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీగానే తనిఖీలు నిర్వహించారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ వ్యక్తికి నిర్వహించిన డిఎన్డీ టెస్ట్‌లో రీడింగ్ 550 పాయింట్స్ చూపించింది. ఆ రీడింగ్ చూసి పోలీసు బాబాయిలే షాక్ అయ్యారట. అలాగే నాంపల్లిలో కొంతమంది ఆటోవాలాలు హంగామా సృష్టించారు. ఫుల్‌గా తాగి రోడ్లపై హల్‌చల్ చేసి.. రోడ్డుపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేశారు.
అలాగే మీర్‌చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి.. మందు తాగి దొరికినవారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కొంతమంది మద్యం మత్తులో పోలీసులపైనే తిరగబడ్డారు. హయత్‌నగర్‌లో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో రెండు వర్గాలుగా విడిపోయిన కొంతమంది యువకులు తన్నుకున్నారు . మద్యం సేవించి రోడ్డెక్కిన కొందరు మందుబాబులు.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. బహదూర్‌పురాలో కూడా ఓ మందుబాబు తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించాడు.