మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపైన, సమంత నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యల తాలుకూ సెగలు ఇంక తగ్గకముందే తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి. అక్కినేని నాగార్జున, సమంతల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై రఘునందన్ రావు వ్యాఖ్యలు ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున పైన, సమంత పైన రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పేర్కొన్న ఆయన 2016 లోనే హెచ్ఎండిఏ దీనిపై రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదు అనేది నేటికీ పెద్ద ప్రశ్న అంటూ మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో హీరో నాగార్జున మాజీ కోడలు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారన్నారు. ఆమెకు చేనేత, చీర గురించి తెలియదని రఘునందన్ రావు అన్నారు. ఆ సంబంధాలేంటో వాళ్లే చెప్పాలని, వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెబితేనే బాగుంటుందని బీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నెల క్రితం ఈ వీడియోను ఐడ్రీమ్ మీడియా యూట్యూబ్ లో పోస్టు చేసింది. మంత్రి కొండా సురేఖ వివాదంతో తాజాగా ఎంపీ రఘునందన్ రావు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాగార్జున రేపు కోర్టుకు హాజరు కానున్నారు.