మాజీ మంత్రి కేటీఆర్‌ది అని చెబుతున్న శంకర్‌పల్లి మండలం జన్వాడలో నిర్మించిన ఫాంహౌస్ కూల్చివేత తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ ఫాంహౌస్‌ను హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలతో ఫాంహౌస్ ఓనర్.. కేటీఆర్ ఫ్రెండ్ అయిన ప్రదీప్‌రెడ్డి ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు.
మరోవైపు ఈ భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయా లేదా అని చేవెళ్ల ఆర్డీవో పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంటు ఆఫీసర్లు ఇటీవల అక్కడ ఫీల్డ్ సర్వే నిర్వహించారు. అయితే నాలా బఫర్‌జోన్‌లో జీ ప్లస్ వన్ కట్టినట్టు సర్వేలో తేలింది. వరుసగా మూడు రోజుల పాటు దీనిపై అధ్యయనం చేసిన వివిధ శాఖల అధికారులు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఈ నివేదిక సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తావించారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగానే హైడ్రా కూడా తన కార్యాచరణను కొనసాగించబోతోంది.
బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో జన్వాడ ఫాంహౌస్ నిర్మాణం జరిగిందన్న అంచనాలతోనే రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల సర్వే నిర్వహించారు. ఎంత వరకూ నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తేల్చుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్న అనుమతులపైన కూడా అధికారులు ఆరా తీశారు. చివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ ఫాంహౌస్‌ను నిర్మించినట్లు నిర్ధారణకు వచ్చారు.
శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఈ పాంహౌస్‌కు రెవెన్యూ శాఖ నుంచి కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించినట్టు స్పష్టతకు వచ్చారు. అలాగే ఇరిగేషన్ శాఖ నుంచి కూడా గ్రౌండ్ లెవల్‌లో సర్వే చేసి.. అప్పటి డాక్యుమెంట్లను కూడా సరిపోల్చి.. నాలా ఆక్రమణకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఎంతవరకూ కుచించుకుపోయింది.ఇలాంటి అంశాలన్నింటిని కూడా శాటిలైట్ ఫోటోల ఆధారంగా అధ్యయనం చేశారు.
ఫాంహౌస్ మొత్తం విస్తీర్ణంలో ఎంత భాగం నాలా బఫర్‌జోన్‌ను ఆక్రమించి నిర్మించారనే అంశాన్ని కూడా లోతుగా స్టడీ చేశారు. ఏకకాలంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు వీటిని పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనపై ఈ మూడు శాఖల అధికారులు వెలిబుచ్చే అంశాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందుకు నివేదిక వెళ్లనుంది. ఇటు గ్రామ పంచాయతీ నుంచి ఈ భవన నిర్మాణానికి జారీ అయిన అనుమతులు, ఇతర శాఖల నుంచి జారీ అయిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లపైన కూడా పూర్తి వివరాల సేకరణ పూర్తయింది.
శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామం.. మీర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం ఈ ఫాంహౌస్ నిర్మించినట్లు తాజా సర్వేలో తేలింది. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ డిజైన్‌తో కట్టిన ఈ భవనానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేదని.. అప్పట్లోనే పంచాయతీ సెక్రెటరీ దీనిని అక్రమ కట్టడం అనే నిర్ధారించారు. ఈ కారణంతోనే అప్పుడు ఫాంహౌస్ యజమానికి నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా ఆయన నివాసానికి కూడా నోటీసులు పంపించారని తాజా సర్వేలో వెల్లడైంది. అయితే ఆ నోటీసులపై ప్రసాదరాజు రెస్పాండ్ అవలేదు. కాకపోతే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత ఫాంహౌస్‌కు గ్రామ పంచాయతీ దానికి ఇంటి నంబర్‌ను కేటాయించిందని తేలింది. అప్పటి నుంచి ప్రతి ఏటా పంచాయతీకి ఆ ఫాంహౌస్ నుంచి ట్యాక్స్ పేమెంట్ జరుగుతూ ఉంది.
ఈ ఫాంహౌస్ మొత్తం 362 చదరపు గజాలు అంటే దాదాపు 3250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టు అప్పటి జీపీ ఆఫీసర్లు తేల్చారు. ఈ లెక్కల ఆధారంగానే ఏడాదికి 11 వేల రూపాయల హౌస్ ట్యాక్స్ ఫిక్స్ చేశారు. ఫాంహౌస్ కట్టిన ప్రాంతం ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంటున్నా..నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమైందని తెలిసినా.. అది మరో శాఖ పరిధి పర్యవేక్షణలో ఉంటుందనే అభిప్రాయంతో ట్యాక్స్ వసూలుకు మాత్రమే గ్రామ పంచాయతీ పరిమితమైనట్టు రెవెన్యూ ఆఫీసర్లు తాజా సర్వేలో తేల్చారు. వేర్వేరు శాఖల అధికారుల సర్వేతో వెల్లడైన వివరాలన్నీ అధ్యయనం చేసి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.