తెలంగాణలో బీజేపీకి పూర్తి సారథి ఎంపికకు వేగంగా కసరత్తు జరుగుతోంది. బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉండగా..50శాతం జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం, 50శాతం జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా బండి సంజయ్ పేరే వినిపిస్తోంది.
2020 నుంచి 2023 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ నేతృత్వంలో పార్టీ గణనీయంగా పుంజుకుంది. పట్టణాలకే పరిమితమైన పార్టీని తన పాదయాత్రల ద్వారా గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ఉద్యమాలతో ఊపు కూడా తెచ్చారు. అయితే 2023 ఎన్నికలకు ముందు బండి సంజయ్ పదవీకాలం పూర్తి కావడంతో..పార్టీ అధిష్టానం ఆయనను తప్పించి తాత్కాలిక అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. ఆయన సారథ్యంలోనే అప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డైలమాలో పడింది.
నిజానికి 2023 ఎన్నికల్లో సంజయ్ సారథ్యంలోనే బీజేపీ పోటీ చేస్తుందని పార్టీ పెద్దలు మొదట ప్రకటించారు. అయితే కొంత మంది నేతల ఒత్తిడికి తలొగ్గిన పార్టీ పెద్దలు పదవీ కాలం ముగిసిన మూడు నెలల తర్వాత సంజయ్‌ను తప్పించి..కిషన్‌రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ఆ తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రావడంతో అధ్యక్షుడి ఎన్నిక అలా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని ఎన్నికలు పూర్తవడంతో నూతన అధ్యక్షుడి నియామకంపైన పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దీని ప్రకారమే ఇప్పుడు కొత్త అధ్యక్షుడి నియామకం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పార్టీనీ అగ్రెసివ్‌గా జనాల్లోకి తీసుకెళ్లే బలమైన నేత కోసం అధిష్టానం చూస్తోంది. తమ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసే నాయకుడు కావాలని హైకమాండ్ కోరుకుంటోంది.
ఎన్నికల ముందు బండి సంజయ్ తీరును మరచిపోని పార్టీ పెద్దలు.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మరోమారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌నే ఎంపిక చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అయితేనే కమలం పార్టీని అగ్రెసివ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్తారని, పార్టీ భావజాలాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని అంచనా వేస్తోంది. నిజానికి ఎన్నికలకు ముందు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీకి మంచి క్రేజ్ రావడంతో..తెలంగాణలో ఇప్పుడు బండి సంజయ్‌కి ముందు.. సంజయ్ తర్వాత అన్న చర్చ జరుగుతోంది. దీంతోనే బీజేపీ హైకమాండ్ మరోసారి కూడా బండి సంజయ్‌కే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది.
కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణలో బీజేపీ మళ్లీ డీలా పడిపోయింది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి.. ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న స్థాయికి పార్టీని తీసుకెళ్లిన బండి సంజయ్‌ని మరోసారి అధ్యక్షుడిగా నియమిస్తే.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కమలం పార్టీకి ఊపు తీసుకువస్తారన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. దీంతోపాటు మున్నూరు కాపు సామాజికివర్గానికి చెందిన నేతగా..సంజయ్‌కు బీసీల్లో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణలో తాజా గణన ప్రకారం 46.65 శాతం బీసీలు ఉన్నారు. ఈ పరిస్థితిలో బీసీ నేతలకే బీజేపీ పగ్గాలు ఇవ్వడం సరైనదని అధిష్టానం ఆలోచిస్తుంది.