తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టు ఎవరికి అనే అంశానికి త్వరలోనే చెక్ పడనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుందని.. షార్ట్ లిస్ట్ కూడా సిద్ధం చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గా సమాచారం.
అవును బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణ బీజేపీ రథసారథి అంశంపై దూకుడు పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరిని ఫైనల్ చేస్తారా అన్న ఆసక్తి పెరిగిపోయింది.
తెలంగాణలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో.. కమలదళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసి సగం సీట్లు అయినా సాధిస్తేనే తెలంగాణలో వచ్చేసారి తమకు అధికారం సాధ్యమవుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.దీనిపై ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని ఈ మధ్య జరిగిన తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లోనూ కాషాయపార్టీ ఎంపీలు శపథం చేశారు.
మరోవైపు టీ-స్టేట్ చీఫ్ పోస్టు కోసం బీజేపీలో పెద్ద పోటీ నెలకొంది. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో పాటు.. కల్వకుర్తి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆచారి కూడా అధిష్టానం ముందు తన మనసులోని కోరిక విన్నవించుకున్నారు.
అయితే వీరిందరిలో ఢిల్లీ పెద్దలు ఎవరిని ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు వీరిలో కొంతమంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన హైకమాండ్. . దీనిపై అభిప్రాయ సేకరణను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పేర్లను ఢిల్లీ పెద్దలు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలియడంతో..ఆ పేర్లు ఎవరివనేది సస్పెన్స్‌గా మారింది.