గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు వేళయింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగా విజేతలకు ఈ అవార్డుల ప్రదానం జరుగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం అందించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలనుంచి అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ వేడుకను తిలకించేందుకు దాదాపు 6వేల మందికి పైగా రానున్నారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. వీరితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సార్ జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు. ఈ అవార్డులతో పాటుగా 2024 నుంచి మరో 6 ప్రత్యేక అవార్డులను కూడా బహుకరించనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు జీవం పోసిన తొలితరం దిగ్గజాలు రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, ఎన్టీఆర్, పైడి జైరాజ్, కాంతారావు, చక్రపాణి పేర్లపై ఈ ప్రత్యేక అవార్డులను అందించనుంది తెలంగాణ ప్రభుత్వం.

అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల విజేతలకు భారీ ప్రైజ్‌మనీ అందించనుంది. ప్రత్యేక అవార్డులకు మరియు మొదటి స్థానంలో నిలిచిన ఉత్తమ చిత్రాలకు ఎక్కువ మొత్తం లభించనుంది. అలాగే ద్వితీయ మరియు తృతీయ స్థానంలో నిలిచిన చిత్రాలకు మరియు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులకు దీనికి కొంచెం తక్కువగా పెద్ద మొత్తమే లభించనుంది. కాగా ఈ అవార్డుల విజేతలకు ప్రభుత్వం బహుకరించే ప్రైజ్‌మనీ వివరాలు ఇలా ఉన్నాయి.

‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ విజేతలకు అందించే ప్రైజ్‌మనీ ఎంతంటే..?

  • రఘుపతి వెంకయ్య అవార్డు – రూ. 10 లక్షలు
  • బీఎన్ రెడ్డి అవార్డు – రూ. 10 లక్షలు
  • ఎన్టీఆర్ అవార్డు – రూ. 10 లక్షలు
  • పైడి జైరాజ్ అవార్డు – రూ. 10 లక్షలు
  • కాంతారావు అవార్డు – రూ. 10 లక్షలు
  • చక్రపాణి అవార్డు – రూ. 10 లక్షలు
  • ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రూ. 10 లక్షలు
  • సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – రూ. 7 లక్షలు
  • థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – రూ. 5 లక్షలు
  • ఉత్తమ నటుడు – రూ. 5 లక్షలు
  • ఉత్తమ నటి – రూ. 5 లక్షలు