కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే నినాదంతో పోటీ చేసింది. తాము హామీ ఇచ్చినట్లుగానే.. తెలంగాణలో ఇటీవల కులగణనను చేపట్టింది.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటూ బీసీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఆందోళనలు కూడా చేశారు. దీంతో ఈ నినాదమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ నినాదాన్నే ఎత్తుకుంది. కేంద్రంలో తాము కనుక అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని ఎన్నికల హామీ ఇచ్చింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాడంతో పంచాయతీ ఎన్నికలకు ముందే కుల గణన చేపట్టాలన్న డిమాండ్ పెరిగింది. దీంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ ఇటీవల కుల గణనున పూర్తి చేసింది. తాజాగా ఆ నివేదికను కేబినెట్ సబ్‌కమిటీ వెల్లడించగా.. ఈ వివరాల నివేదికను కుల గణన ప్లానింగ్ మిషన్ అధికారులు అందించారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కుల గణన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చడానికి డిసెంబర్‌లో కుల గణన చేపట్టారు. పది రోజుల పాటు ఈ సర్వే చేసి..ఆ తర్వాత పది రోజులు ఆన్లైన్‌లో నమోదు చేశారు. ఈ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి ఇవ్వగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణన వివరాలు వెల్లడించారు.
తెలంగాణ 96.9 శాతం కుల గణన పూర్తయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని వివరించారు. కుల గణన సర్వే దేశ భవిష్యత్‌కు ఓ దిక్సూచి అని అభిప్రాయపడిన ఆయన.. సామాజిక న్యాయం కోసమే తాము ఈ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 4న నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నివేదికపై తామంతా చర్చించి.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా మొత్తం.. 3కోట్ల 54 లక్షల 77వేల 554 మంది. మొత్తం 1కోటి 12లక్షల15వేల 134 కుటుంబాలు. కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా – 61 లక్షల84వేల 319 అంటే రాష్ట్రంలో 17.43 శాతం. అలాగే ఎస్టీల జనాభా 37 లక్షల 5 వేల929 అంటే రాష్ట్ర జనాభాలో 10.45 శాతంగా ఉంది. ఇక అత్యధికంగా బీసీల జనాభా – 1 కోటి 64లక్షల 9,179 అంటే రాష్ట్రంలో 46.25 శాతం ఉంది.
ముస్లింల జనాభా– 44లక్షల 57వేల 12 మంది అంటే రాష్ట్రంలో 12.56 శాతం ఉంది.వీరిలో బీసీ ముస్లింలు: 35లక్షల76వేల588 అంటే 10.08 శాతంకాగా
ఓసీ ముస్లింలు: 8లక్షల 80వేల424 అంటే 2.48 శాతంగా ఉన్నారు. కాగా ఓసీల జనాభా– 44లక్షల21వేల115 అంటే రాష్ట్ర జనాభాలో 13.31 శాతం ఉంది.
మొత్తం ఓసీ జనాభా – 15.79 శాతంగా ఉన్నట్లు కులగణన సర్వే తేల్చింది.