బండి సంజయ్ చేస్తుంది పాదయాత్ర కాదు, అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర : మంత్రి కేటీఆర్

TRS Working President KTR Writes Open Letter on Bandi Sanjay Praja Sangrama Yatra, Bandi Sanjay Praja Sangrama Yatra, Minister KTR Writes Open Letter on Bandi Sanjay Praja Sangrama Yatra, KTR Writes Open Letter on Bandi Sanjay Praja Sangrama Yatra, TRS Working President KTR, Telangana Minister KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Telangana BJP Chief Bandi Sanjay, Telangana BJP Chief, Bandi Sanjay, Praja Sangrama Padayatra, 2nd Of Phase Praja Sangrama Padayatra, Bandi Sanjay Praja Sangrama Padayatra, Praja Sangrama Padayatra News, Praja Sangrama Padayatra Latest News, Praja Sangrama Padayatra Latest Updates, Praja Sangrama Padayatra Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేస్తుంది పాదయాత్ర కాదని, అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. “బండి సంజయ్ తన పాదయాత్రను పాలమూరు జిల్లా నుంచి ప్రారంభించడమంత దగాకోరుతనం ఇంకొకటి లేదు. పచ్చ బడుతున్న పాలమూరుపై పగ బట్టిన పార్టీకి అధ్యక్షుడైన బండి సంజయ్ కు అక్కడ అడుగుబెట్టే నైతిక అర్హత లేదు. పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానికానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ, ఎగతాళి చేస్తున్న నియంతృత్వ పోకడలపై ముందుగా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పి పాదయాత్రను ప్రారంభిస్తే కాస్తైనా గౌరవం దక్కుతుంది” అని కేటీఆర్ అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాపై పార్టీ స్పందన ఏంటో చెప్పాలి:

“ఒకప్పుడు పల్లేర్లు మొలిసిన పాలమూరు గడ్డ, ఈ రోజు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదన్న నిజాన్ని కలలో కూడా ఓర్వలేకపోతున్న నాయకత్వం బీజేపీది. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ, పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా? పాలమూరు జిల్లా వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన కృష్ణా జలాలలో వాటా తేల్చకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో ఒక శిఖండి సంస్థను ఏర్పాటుచేసి పాలమూరుకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సందిగ్దంలోకి నెట్టిన కుట్రపూరిత పార్టీ భారతీయ జనతా పార్టీ. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ, పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న భాజాపా బానిస నాయకులు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా?, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్పందన ఏంటో బండి సంజయ్ చెప్పాలి. పక్కనే ఉన్న కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పిన తరువాతనే పాలమూరు గడ్డ మీద బండి సంజయ్ అడుగుపెట్టాలి. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో సమాధానం చెప్పాలి? పాలమూరు రైతు చేసిన పాపం ఏంది..? పాలమూరు ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల, మాచార్ల రైల్వే లైన్ ను ఎలా పూర్తి చేస్తారో బండి సంజయ్ స్పష్టం చేయాలి” అని అన్నారు.

బండి సంజయ్ తన పాదయాత్రకు రైతు దగాయాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది:

“ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభిస్తున్న బండి సంజయ్, రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులను తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ, ఆ కోదండ రాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలపాలి. దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే బండి సంజయ్, భారతీయ జనతా పార్టీలది. కాని మేం మాత్రం అంచంచలమైన భక్తి, అంకుఠిత దీక్షతో ఆ సేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించాము. ఈ దైవకార్యంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా? దేవుళ్లు, దైవాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రైతాంగాన్ని కూడా తన చిల్లర రాజకీయాలకు బలి చేస్తోంది. వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చినంక తప్పించుకు తిరుగుతున్న బండి సంజయ్ తన పాదయాత్రకు రైతు దగా యాత్ర లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితిపై బండి సంజయ్ తన వైఖరిని స్పష్టం చేసినంకనే పాదయాత్ర ప్రారంభిస్తే మంచిది. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా?, రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా? వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారం బీజేపీది. రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు” అని చెప్పారు.

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు:

“దశా దిశా లేని బీజేపీ దరిద్ర విధానాలతో దేశంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కాలు రాని నాయకత్వం ప్రజలపై చేస్తున్న సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చేలా మీరు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్టున్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కేంద్ర ప్రభుత్వ చేతగానితనంపై ప్రజలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయమే చేసింది. పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై కత్తిగట్టింది. అధికారం ఉందన్న అహంకారంతో తెలంగాణ 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపిన బీజేపీ దౌర్జన్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు. నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు. నదీ జలాల్లో వాటాలు తెల్చకుండా జలదోపిడికి సహకరిస్తారు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు. సందు దొరికితే దాలు తెలంగాణ మీద విషం గక్కుతారు. తెలంగాణ అంటేనే గిట్టని బీజేపీ నాయకులు కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? పాదయాత్రే కాదు. మోకాళ్లపై దేక్కుంటూ యాత్ర చేసినా బండి సంజయ్, భాజాపాను తెలంగాణ ప్రజలు నమ్మరు. బీజేపీ పార్టీ డిఎన్ఏ లో ఉన్న వివక్ష, విభజన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గుర్తించి తిరస్కరిస్తారు” అని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =