
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎప్పుడూ దూకుడుగానే ఉంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన స్వపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా హడావిడి చేస్తూనే ఉంటారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక అనూహ్యంగా గంగుల సైలెంట్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో కూడా గంగుల దూరంగానే ఉంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాల్సి వచ్చినా తూతూ మంత్రంగా కనిపించి వెళ్లిపోతున్నారు. దీంతో గంగుల కమలాకర్ మౌనం వెనుక ఏముంది? తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ జోరుగా సాగుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నాయకుడు అంతేకాదు..ఆయన బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడిగా, ఇప్పటి వరకూ ఓటమి చెందని లీడర్‌గా వరుసగా విజయాలను సాధిస్తున్నారు. మరోవైపు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. ఈ పదేళ్లలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై నడిపించడంలో గంగుల పేరు నానుతూ ఉండేది.
2009లో టీడీపీ విజయం సాధించిన తరువాత 2014 ఎన్నికల కంటే ముందు గంగుల కమలాకర్ బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2014, 2018, 2023లో ఇలా మొత్తం నాలుగుసార్లు కరీంనగర్ నుంచి ఆయన విజయాన్ని సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత మాత్రం పూర్తిగా హడావుడి తగ్గించిన గంగుల కమలాకర్ సైలెంట్ అయిపోయారు. చివరకు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన అంత దూకుడు ప్రదర్శించలేదు సరికదా.. చివరకు నియోజకవర్గంలో చేపట్టిన ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు.
ఎప్పుడూ మీడియాలో యాక్టివ్‌గా కనబడే గంగుల కమలాకర్ ఇప్పుడు మీడియాకి దూరంగా ఉండటంతో.. ఇంతకీ గంగుల మనసులో ఏముందంటూ పార్టీ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో.. కమలాకర్ టీడీపీ కలిసి పనిచేయడంతో.. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. దీంతోనే ప్రభుత్వంపై గంగుల ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. అయితే గంగుల త్వరలోనే పార్టీ మారుతారంటూ తన అనుచరులకి సంకేతాలు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ గంగుల మాత్రం తాను పార్టీలోనే ఉంటానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో గంగుల మనసులో ఏముందనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY