ఏపీలో తాజాగా వచ్చిన వరదల్ని విజయవాడ వాసులు మర్చిపోకముందే మరోసారి వరద ముప్పు వారిని భయపెడుతోంది. కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ప్రవాహంతో తీరప్రాంత వాసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నీటి మట్టాల్ని ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. దీనికి అనుగుణంగా స్ధానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు.
నిన్న బెజవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 45 క్యూసెక్కుల వరకూ వరద ప్రవాహం ఉన్నట్లు బ్యారేజ్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అయినా పై నుంచి క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహంతో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి.
దీంతోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. అలాగే మత్స్యకారులు నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గత నెలలో బెజవాడలోని బుడమేరు పొంగడంతో అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతతో లక్షల సంఖ్యలో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
కాగా.. ఇప్పుడు కృష్ణానదిలో వస్తున్న వరదల ప్రభావాన్ని అక్కడ నిర్మించిన రిటైనింగ్ వాల్ అడ్డుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భారీ ప్రవాహం వస్తే మాత్రం రిటైనింగ్ వాల్ దాటి కూడా వరద నీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతోనే ముందస్తు జాగ్రత్త చర్యగా తాడేపల్లి నుంచి కరకట్ట వెంబడి ఉన్న ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.