తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక సమగ్ర డిజిటల్ వేదికగా భూభారతి పోర్టల్ రూపొందించబడింది. ఈ పోర్టల్ భూ యజమానులకు వారి భూమి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ప్రస్తుతం ఈ పోర్టల్ తెలంగాణలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. భూభారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 ఏప్రిల్ 14న శిల్పకళా వేదికలో ప్రారంభించారు. భూమి సంబంధిత వివరాలను డిజిటల్ రూపంలో ఈజీగా అందుబాటులోకి తీసుకురావడం, భూ వివాదాలను తగ్గించడం, పారదర్శకతను పెంచడం వంటి ఉద్దేశాలతో ఈ పోర్టల్‌ను తీసుకువచ్చారు.ఈ పోర్టల్ లో భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నాలా దరఖాస్తులు,వివాద పరిష్కారం వంటి సర్వీసులను పొందొచ్చు.
భూభారతి పోర్టల్ అనేక లేటెస్ట్ ఫీచర్స్‌తో రూపొందించబడింది. భూమి రికార్డులను పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చడం వల్ల భూ యజమానుల వివరాలు, భూమి పరిమాణం, రిజిస్ట్రేషన్ సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే జీపీఎస్ ఆధారిత సర్వేవల్ల భూమి సరిహద్దులను కచ్చితంగా గుర్తించడం ద్వారా భూ వివాదాలను తగ్గించే అవకాశముంటుంది. ఈ సర్వే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
భూధార్ నంబర్ అంటే ప్రతీ భూమికి కూడా ఒక యూనిక్ భూధార్ నంబర్ జారీ చేయబడుతుంది. దీనివల్ల భూమి వివరాలను త్వరగా గుర్తించొచ్చు.అంతేకాకుండా భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వ్యవసాయేతర భూమి అప్లికేషన్లు, అప్పీల్స్, వివాద పరిష్కారం వంటి అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా భూ వివాదాలను న్యాయస్థానాలకు వెళ్లకుండా పరిష్కరించాడానికి అప్పీల్స్ వ్యవస్థ కూడా దీనిలో అందుబాటులో ఉంది.
డిజిటల్ రికార్డుల ద్వారా అవినీతిని తగ్గించి, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచొచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం. ల్యాండ్ రికార్డ్స్ తనిఖీ చేయడానికి ముందుగా భూభారతి పోర్టల్ యొక్క అధికారిక వెబ్సైట్ https://bhubharati.telangana.gov.in.ను సందర్శించాలి. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఉపయోగించవచ్చు.ల్యాండ్ డిటైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెబ్సైట్ హోమ్‌పేజీలో ల్యాండ్ డిటైల్స్ లేదా ల్యాండ్ రికార్డ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.భూమి ఉన్న జిల్లా, మండలం, గ్రామాన్ని డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఎంచుకోవాలి. ప్రత్యామ్నాయంగా, మీ పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.అవసరమైతే, ఈ వివరాలను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.