హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనపై రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు .. మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 టీమ్‌లతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో 16 , రంగారెడ్డిలో నాలుగు, మేడ్చల్ జిల్లా పరిధిలో ఐదు బృందాలుగా ఈ సర్వే చేస్తున్నాయి.
నదీ గర్బంలోని నిర్వాసితుల నిర్మాణాల గురించి వివరాలను సేకరిస్తున్న అధికారులు… తొలిసారి సర్వే చేశాక మరోసారి రీ సర్వే చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దిల్‌సుఖ్ నగర్ ఏరియాలోని కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్‌లో మూసీ నివాసితులు అధికారులను అడుగు కూడా పెట్టనీయలేదు .
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమంటూ మూసి నివాసితుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం సర్వే మాత్రమేనని, అంతకుమించి మరేమీ లేదని అధికారులు ప్రజలకు నచ్చచెప్పినా వారు ఏ మాత్రం అంగీకరించలేదు. పరిస్థితి గమనించిన అధికారులు సర్వే నిర్వహించకుండానే తిరిగి వెళ్ళిపోయారు.
ఇలాంటి పరిస్థితి ముందే ఊహించిన కాంగ్రెస్ సర్కార్..మూసీ నది అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు మూవీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.బఫర్ జోన్‌లో ఉంటున్న 15 వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. బుధవారం దీనిపై ప్రత్యేకంగా జీవో జారీ చేసింది.
నిజానికి మూసీ రివర్ బెడ్ లో 2వేలకు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 అక్రమ నిర్మాణాలు .. మల్కాజిగిరిలో 239 నిర్మాణాలు, రంగారెడ్డి జిల్లాలో 332 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. పునరావాసం కల్పించిన తర్వాతే మూసీలో నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాలలో వరదల సమయంలో జంట జలశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినపుడు అక్కడివారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు.చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండే శంకర్ నగర్, మూసారం బాగ్ లో కొన్ని బస్తీల పరిస్థితి వరదల సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, మూసీ నుంచి 50 మీటర్ల వరకు ఉండే బఫర్ జోన్, రివర్ బెడ్ లోనూ ఉండే ఇళ్లు అన్నింటినీ తొలగించి.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది.