తెలంగాణ కేబినెట్ సమావేశం మార్చిన 6న సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై సమాలోచనలు జరగనున్నాయి. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం మరో బిల్లును తీసుకురానున్నట్లు సమాచారం. ఈ రెండు బిల్లులను కూడా మార్చి 6న జరిగే కేబినెట్లో ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి మరో బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఈ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28న ముగిసిన రెండో విడత కులగణన సర్వే ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆర్థిక సాయంతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలపైన కేబినెట్ చర్చించబోతోంది. మార్చి నెలలోనే ఈ లబ్దిదారులను ఫైనల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ బడ్జెట్ సమావేశాలను మార్చి రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభం కానుండటంతో, అసెంబ్లీ సమావేశాలను అంతకు ముందే నిర్వహిస్తే మంచిదా లేక అదే సమయంలో ప్రారంభించాలా అనే అంశంపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు.