తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. “కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పాము. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. ఇప్పటికే తెలంగాణ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి స్థాయి/పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించాయి. మొత్తానికి ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది” అని అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలి :
“లాక్‌డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. టెస్టులు, ట్రీట్ మెంట్ ఆగకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయింది. ఈ లాక్‌డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి. రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమిడీసీవర్ ఇంజెక్షన్ లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఆక్సిజన్, రెమిడీసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలి. కరోనా చికిత్స కు అవసరమైన అన్నీ రకాల మందులను అందుబాటులో ఉంచాలి. కరోనా పేషేంట్లకు సేవలు అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వాటి యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. గతేడాది మొదటి లాక్‌డౌన్ లో లాగానే బీజేపీ కార్యకర్తలు లాక్‌డౌన్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆహారాన్ని అందించాలి. తమ తమ బూత్ ఏరియాలో నిరుపేదలకు అవసరమైన సాయం చేయాలి” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ