హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుమాయిష్ దేశవ్యాప్తంగా ఏంతో ఆదరణ నెలకుందని, జనవరి నెల వచ్చిందంటే హైదరాబాద్ గుర్తుకువచ్చేలా నుమాయిష్‌ను తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.
ప్రతి సంవత్సరం లాగానే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. గతంలో ఉన్న ప్రవేశ మార్గాలతో పాటుగా అదనంగా మరో ఆరు మార్గాలను ఏర్పాటు చేశారు. అలాగే ఇంతకముందు దాదాపు 2500 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు వాటిని కొద్దిశాతం కుదించనున్నారు. గత సంవత్సరం ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతా ప్రమాణాలకు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వహణ జరిగినన్ని రోజులు సందర్శకుల సౌకర్యార్థం మెట్రో రైలు సర్వీసులు రాత్రి 11 గంటల వరకు నడపనున్నారు.
[subscribe]