ప్రపంచంలో గత 5 వేల ఏళ్లలో ఎంత పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏళ్లలో అంత పట్టణీకరణ జరుగబోతోందని తెలిపారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు. సోమవారం హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28కి సంబంధించిన విధాన పత్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ బీ వెంకటేశ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఐఐఐటీ ప్రొఫెసర్ విశాల్ గార్గ్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, ఎన్ఆర్డీసీ ప్రతినిధి నీతూజైన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాల కోసం దేశంలోనే తొలిసారిగా ‘కూల్ రూఫ్ పాలసీ’ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మున్ముందు ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారనున్నదని పేర్కొన్నారు. అయితే ఇది ఓట్లు, సీట్ల కోసం తెచ్చిన పాలసీ కాదని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. కాగా కూల్రూఫింగ్పై మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నామని, అలాగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పెట్టి, చర్చించి కార్పొరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మికి సూచించారు. రాష్ట్రంలో ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు కూల్ రూఫ్ పాలసీ అమలు తప్పనిసరి చేయనున్నామని, 600 గజాల పైన నిర్మాణం చేసే భవనాలకు ఇది తప్పనిసరి అని మంత్రి తెలిపారు.
నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, అందుకే ఈ సమయంలో కూల్‌రూఫ్ పాలసీ తెచ్చామని, వేసవిలో ఈ పాలసీని తీసుకురావడం ద్వారా మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలో ‘మన నగరం’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నామని, హైదరాబాద్‌లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు రెట్రో ఫిట్టింగ్ చేయవచ్చని తెలిపారు. ఇంకా మిద్దె తోటలు, రూఫ్‌టాప్ కిచెన్ల ఏర్పాటుపై ప్రజలను ప్రోత్సహించేలా ఒక విధానం రూపొందించాలని మున్సిపల్‌శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కూల్ రూఫ్ కోసం చదరపు మీటరు రూ.300 వరకు ఖర్చు అవుతుందని నిపుణులు లెక్కలు వేశారని, ఇక రూఫ్ చల్లబడటంతో పాటు గోడలు కూడా చల్లగా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించడంపై కూడా అధ్యయనం జరగాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 10 కోట్ల చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాన్ని కూడా పెయింట్ వేసి కూల్ రూఫింగ్ కిందికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో పాటు ఇకపై ప్రభుత్వం నిర్మించే అన్ని భవనాలనూ కూల్ రూఫింగ్ కిందికి తీసుకువచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూయార్క్ నగరంలో 10 లక్షల చదరపు ఫీట్లు (0.1 చదరపు కిలోమీటర్లు) మాత్రమే కూల్ రూఫింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే మనం మాత్రం వచ్చే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్లను లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు , ఇతర ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్లు కూల్రూఫింగ్ను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ఔటర్ రింగ్‌రోడ్ లోపల 1000 చదరపు కిలోమీటర్లు ఉంటుందని, దీనిలో 20 శాతం కూల్ రూఫింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE