
తెలుగుదేశం పార్టీకి రెబెల్స్ బెడద తప్పడం లేదు. టికెట్లు రానివారు, చివరి నిమిషంలో సీట్లు మారిన కొన్ని స్థానాల్లో ఆ పార్టీకి అసంతృప్త నాయకుల నుంచి ముప్పు పొంచి ఉంది. దీంతో కూటమి అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడినా, సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి బుజ్జగించినా పలుచోట్ల కొందరు నేతలు మారలేదు. నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీలో వర్గ పోరు అనివార్యమైంది.
తెలుగుదేశం పార్టీ కొందరు ప్రధాన నేతలకు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు పూసపాటి ఆదితి గజపతిరాజు తదితరులకు రెబల్స్ ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉండిలో రఘురామపై మాజీ శివరామరాజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరిన రెండు రోజుల్లో ఆయనకు టికెట్ ఎలా ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు శివరామరాజు. ఇక హిందూపురంలో ఓటమే ఎరుగని బాలకృష్ణకు శ్రీపీఠం పీఠాధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీతోపాటు, లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే.. బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనార్టీ ఓట్లు వైసీపీకి మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ చేసినప్పటికీ…, తెలుగుదేశం అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో రెబల్స్ నుంచి చిక్కులు తప్పవు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY