
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర ముగిసింది. ఏపీలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. తెలంగాణలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటేశారు. కానీ రాజధాని హైదరాబాద్ పట్టణంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం నుంచే నగరంలో పోలింగ్ మందకొడిగానే సాగింది. ఓటు వేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూప లేదు.. 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. చాలామంది ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడం లేదు.. దీంతో హైదరాబాద్ పాతబస్తీలో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోయాయి. ఇక సాయంత్రం వరకూ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 29.47 శాతం, మల్కాజిగిరిలో 37.69, సికింద్రాబాద్ పరిధిలో 34.58 శాతం, గ్రామీణ నేపథ్యం ఉన్న చేవెళ్లలో 45.35 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రా.. కదలిరా.. ఓ యువతా.. ఓటేసేందుకు తరలిరా.. అంటూ ఎన్నికల సంఘం విన్నవించినా, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టినా పట్టణ ఓటరు పట్టించుకోలేదు.
ఇదే క్రమంలో ఏపీలోని గిరిజనులు చాటిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉదాహరణగా పేర్కొంటూ నగర ఓటర్ల తీరును విమర్శిస్తున్నారు. ఓటు కోసం కొండలు, రాళ్ల గుట్టలు దాటొస్తూ, డోలి సహాయంతో వృద్ధులను సైతం మోసుకొస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఏపీలో గిరిజనులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు గొప్పతనాన్ని దేశానికి మరోసారి చూపిస్తున్నారు. దేహానికి తప్ప దాహానికి ఉపయోగపడని సముద్రపు కెరటాలే ఎగసెగసి పడుతుంటే.. అన్నట్లు ఏ మౌలిక సౌకర్యాలు లేకుండానే ఓటు కోసం ఇంతగా కష్టపడి వస్తున్న ఈ గిరిజనులను చూసైనా మార్పు రావాలని పలువురు సూచిస్తున్నారు. ఓటు వేసేందుకు రావాలని తమ ఇళ్ల వద్దకే వాహనాలు పంపుతున్నా కొందరు ఓటుకు ముందుకు రావడం లేదు రోడ్లు, వాహనాలు ఇలా చాలా మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. ఓటు వేయడానికి ఉత్సాహం చూపని వారికి చెంపపెట్టుగా నిలిచింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అలాంటి వాతావరణం నుంచి ఓటేసేందుకు వచ్చిన గిరిజనులకు ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి.. నగర ఓటర్లకు లేకపోవడం విచారకరమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం 70.75గా నమోదైంది. గత ఎన్నికల్లో అది 62.25 శాతంగా ఉంది. అంటే 8.50 శాతం ఈసారి ఓటింగ్ తగ్గింది. ఈ లెక్కన లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఖమ్మంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్ లో 39.49 మేర ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరి సెగ్మెంట్ లో 42.75.. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 శాతం ఓటింగ్ నమోదైంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగరం పరిధిలో ఉన్నాయి. మిగతా 14 స్థానాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. నగరంలోని ఈ మూడు నియోజకవర్గంలో 50 శాతం లోపు మాత్రమే ఓట్లు పోల్ కావడం గమనార్హం. ఈనేపథ్యంలో ఈసారి కూడా హైదరాబాద్ టాక్ ఆఫ్ ద ఓటింగ్ గా మారింది. పట్టణ ఓటర్లకు ఎప్పుడూ బద్దకం అని ప్రతిసారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పట్టణ ఓటర్లలో చైతన్యలేకపోవడం గమనార్హం. కాగా, నగరంలో ఉంటున్న చాలా మందికి రెండు ఓట్లు ఉండడం, అలాంటి వారు ఓటు హక్కు స్వగ్రామంలో వినియోగించుకోవడానికి వెళ్లడం కూడా హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తగ్గడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY