తెలంగాణ, ఏపీలో ఎన్నికల సమరం ముగియడంతో ఎక్కడ చూసినా గెలుపోటములపైనే చర్చలు సాగుతున్నాయి. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి సర్వేల మాట ఎలా ఉన్నా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా వైఎస్సార్సీపీనే గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఆయన కుమారుడు కేటీఆర్ అయినా జగనే గెలుస్తారంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు.
నిజానికి 2019 ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరింది. అధికారంలోకి వచ్చాక విమర్శించుకున్నవారే తర్వాత మాత్రం అనూహ్యంగా సయోధ్య కుదిరింది. రాయలసీమను రతనాల సీమ చేద్దామని.. కృష్ణా గోదావరి నీళ్లతో రెండు రాష్ట్రాలను సస్యశ్యామలం చేద్దామని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు మీటింగుల మీద మీటింగులు పెట్టారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి కేసీఆర్.. జగన్‌ను ఆహ్వానించగా… కేసీఆర్ ఏపీకి కూడా వెళ్లొచ్చారు.అలా ఒకరికి ఒకరు సహకరించుకుంటూనే వచ్చారు.
కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక ఆ పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగి అధికారపార్టీలోకి జంపయ్యారు. అలాగే ఓడిపోయిన కొందరు మాజీలు కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి కొత్త కండువా కప్పుకున్నారు.దీంతో మే 13న జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ పట్టు నిలుపుకోవడానికి కేసీఆర్ శక్తినంతా పుంజుకుని ప్రచారం చేసి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కేసీఆర్, కేటీఆర్ ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. బయట పడటమే కాదు.. లోలోపల కూడా జగన్ ప్రభుత్వం రావాలని ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే జగన్ మళ్లీ రావాలని, కేసీఆర్, కేటీఆర్ చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు. పోలింగ్ కంటే ముందే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దుమారాన్ని రేపింది.
అయితే దీనికంతటికీ కారణం జగన్‌పై ప్రేమ కాదని.. బీజేపీ, కాంగ్రెస్‌పై కోపమేనన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు.. బీజేపీకి సమదూరాన్ని పాటిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్.. కేంద్రంలో బీజేపీ కావడంతో.. రెండు పార్టీలతో బీఆర్ఎస్ పొలిటికల్ యుద్ధం చేస్తోంది. దీంతో ఏపీలో జగన్ వస్తే ఎంతోకొంత తనకు రాజకీయంగా సపోర్ట్ దొరుకుతుందని గులాబీ బాస్ అనుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY