
మైలవరం నియోకవర్గంలో వైసీపీ చేసిన ప్రయోగం ఫెయిలయిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వరుసగా కమ్మ సామాజికవర్గం గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో.. వారి ఆధిపత్యానికి ఈ సారి గండికొట్టాలని భావించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఘోరంగా విఫలమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి మైలవరం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కమ్మ సామాజికవర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్లు కేటాయిస్తూ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్నికల తర్వాత జరిగిన విశ్లేషణలు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, వృద్ధులు ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు వేస్తే తప్ప ఇక్కడ ఆ పార్టీ గెలుపు కష్టమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి మరీ పోటీకి దిగడం వైసీపీకి మైనస్ అయ్యే అంశంగా భావిస్తున్నారు.
టీడీపీకి మైలవరంలో మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 లలో మైలవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో దేవినేని భారీ నీటిపారుదల శాఖ మంత్రిగానూ పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అతి సన్నిహితమైన నాయకుడిగా ఉమ ఉన్నారు.అలాంటి దేవినేని ఉమామహేశ్వరరావును ఈసారి పక్కన పెట్టి మరీ వైఎస్సార్సీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. దేవినేని ఉమకు టిక్కెట్ ఇవ్వకపోయినా కూడా దేవినేని ఉమ మాత్రం.. వసంత గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నందిగామ జనరల్ నియోజకవర్గంగా మారుతుందని, అప్పుడు ఆ స్థానం నుంచి పోటీ చేయవచ్చని ఉమకు నచ్చచెప్పడంతో ఆయన ఈ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే దేవినేని ఉమకు కీలక పదవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే వసంత టీడీపీలోకి వెళ్లిపోవడంతో.. వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని కాదని ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను తమ అభ్యర్థిగా ప్రకటించి ఒక ప్రయోగం చేసింది. అయితే జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న నర్నాల తిరుపతి యాదవ్ ఆర్థికంగా కూడా వసంత కృష్ణ ప్రసాద్‌ను ఎదుర్కొనే నేత కాదు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్‌కు ఈ సారి అవకాశమిచ్చినా కాస్త బాగుండేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జోగిరమేష్‌ను పెనమలూరుకు పంపి తిరుపతి యాదవ్‌ను మైలవరానికి ఎంపిక చేయడంతో ఆయన వసంత దూకుడు ముందు తేలిపోయారు. .
వసంత కృష్ణప్రసాద్‌కు నియోజకవర్గంలో పట్టు ఉండటం మాత్రమే కాదు మంచి పేరు కూడా ఉంది. దీంతో ఈసారి జగన్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యేటట్లు కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది. టీడీపీ నేతలు సమిష్టిగా పనిచేయడం ఆ పార్టీకి ప్లస్ అయితే వైసీపీ అభ్యర్థి మాత్రం అన్ని విషయాల్లోనూ వెనుకబడ్డారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ రెండోసారి గెలవడం ఖాయమని లోకల్‌గా న్యూస్ వినిపిస్తోంది. దీంతో వసంతను వదులుకుని జగన్ తప్పు చేశారనే చర్చ వైసీపీలోనూ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY