బీఆర్ఎస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్డడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డిగానే వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆయనపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో కాంగ్రెస్ ఆరోపించిన విమర్శలను నిజంగా చేస్తూ ఆయన అక్రమాస్తులపై కొరడా ఝలిపిస్తూనే ఉన్నారు.
అయితే బీఆర్ఎస్ హయాంలో చాలామంది ఎమ్మెల్యే, మంత్రులపై భూ కబ్జా వంటి ఆరోపణలు ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చీ రాగానే చామకూర మల్లారెడ్డినే టార్గెట్ చేసుకున్నారు. చివరకు మల్లారెడ్డి కాలేజ్‌కు వెళ్లే రోడ్డును కూడా అక్రమంగా వేసారంటూ అధికారులు తవ్వించారు. అయితే ఇదంతా మల్లారెడ్డి నోటి దురుసు వల్లే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. లేదంటే రేవంత్ రెడ్డి మరీ అంత టార్గెట్ చేసే మనిషి కాదని కాంగ్రెస్ నేతలు సైతం చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఏ స్థాయిలో అధికార దర్పం ప్రదర్శించారో అందరికీ తెలిసిందే. మేడ్చల్,మల్కాజిగిరి జిల్లాలో మల్లారెడ్డి దూకుడుకు అడ్డు అదుపే లేకుండా పోయింది. మేడ్చల్ ,మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో మల్లారెడ్డితో పాటు..అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి విచ్చలవిడిగా కబ్జాలు చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా చెరువుల యొక్క శిఖం భూములు, ఎఫ్టిఎల్ను ఆక్రమించేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం,విద్యా సంస్థల నిర్వహణ వంటివి చేశారంటూ కాంగ్రెస్ నేతల ఆరోపించారు.
ఇదే విషయమై అప్పుడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మల్లారెడ్డి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భూముల ఆక్రమణ కోసం అచ్చొచ్చిన ఆంబోతులా తిరుగుతున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్నారు. ఏకంగా అరే గూట్లే దమ్ముంటే రమ్మని.. తొడ కొట్టి మరీ సవాల్ విసిరారు. దీంతో రేవంత్ రెడ్డి అప్పట్లో బాగా హార్ట్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. దీంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రాగానే మల్లారెడ్డి కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారన్న టాక్ నడుస్తోంది.
మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలతో పాటు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కళాశాలలు కట్టారనే ఆరోపణలపై అధికారులు కాలేజీలలోని కొంత భాగాన్ని కూల్చేశారు.
అలాగే సుచిత్రలోని సర్వేనెంబర్ 82లో మల్లారెడ్డి సుమారు 2 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని , అంతేకాకుండా బొమ్మరాస్ పేటలో ఓ చెరువు ఎఫ్టిఎల్ భూమిని కూడా కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. అయితే మల్లారెడ్డి గతంలో రేవంత్‌పై వ్యవహరించిన తీరు వల్లే ఇప్పుడు ఆయన విషయంలో అధికారులు దూకుడుగా వ్యవహరించడానికి కారణమన్న టాక్ నడుస్తోంది. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని..ఆ అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY