తెలంగాణలో రేగిన సింగరేణి చిచ్చు రాజకీయంగా అంతకంతకూ అగ్గిని రాజేస్తోంది. సింగరేణిలో బొగ్గుగనుల వేలాన్ని కొద్ది రోజులుగా వ్యతిరేకిస్తున్న గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్‌ను కూడా రెడీ చేసింది. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో రీసెంటుగా సమావేశమైన మాజీ మంత్రి కేటీఆర్.. మరోసారి తాము ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించడానికి కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కయి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాల్సి పోయి..అంతా కలిసి నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని… దీనిని అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు..
మరోవైపు కేటీఆర్‌తో భేటీ తర్వాత బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది . తెలంగాణలో జులై 1 నుంచి 9న వరకు నిరసనలతో పాటు భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు తామంతా వినతిపత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాల సమయంలో.. డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది.
బొగ్గుగని కార్మిక సంఘం యాక్షన్ ప్లాన్ ప్రకారం..జులై 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన,జులై 3న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం ఉంటుంది. అలాగే జులై 6న జి.ఎం.ఆఫీసుల ముందు ధర్నా,జులై 9న గోదావరిఖనిలో భారీధర్నా నిర్వహిస్తారు. రెండో దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వడం, ఇందిరాపార్క్ వద్ద ధర్నాకార్యక్రమం ఉంటుంది. అలాగే పార్లమెంట్ సమావేశాల సమయంలో న్యూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమం ఉంటుంది. మరోవైపు సింగరేణి గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ లను మాజీ సీఎం కేసీఆరే ప్రైవేట్ వాళ్లకి కట్టబెట్టిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పదేళ్లలో.. సింగరేణిని ధ్వంసం చేశాయని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా సింగరేణిపై రగిలిన ఈ చిచ్చుకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE