
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై పుట్టెడు కష్టాల్లో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండోసారి అధికారం దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లారు. కానీ ఫలితాలు వారికి బిగ్ షాక్ ఇచ్చాయి. కనీసం 50-60 స్థానాలు కూడా వైసీపీకి దక్కలేదు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమయింది. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లంతా పార్టీ ఫిరాయించబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా వైసీపీకి సినీనటడువు అలీ బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
అవును.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కుతాయని అలీ ఆశించారు. రాజ్యసభకు పంపిస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కనీసం 2024 ఎన్నికల్లో అయినా టికెట్ దక్కుతుందని భావించారు. కానీ అప్పుడు కూడా అలీకి నిరాశే ఎదురయింది. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన అలీ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి ప్రచారంలో కూడా అలీ పెద్దగా పాల్గొనలేదు. ఇక ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అలీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు.
ఇకపోతే 2019లో ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో అలీకి టికెట్ దక్కకపోయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థుల తరుపున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వారి గెలుపు కోసం కృషి చేశారు. ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహించి వైసీపీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి అయినా దక్కుతుందని అలీ ఆశించారు. కానీ అవి కాకుండా చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని పోస్టును ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో అయినా టికెట్ దక్కుతుందని అలీ ఆశించి.. ఆ పోస్టుతో సంతృప్తి చెందారు.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అలీకి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మైనార్టీలు ఎక్కువగా ఉండే స్థానంలో అలీకి టికెట్ ఇచ్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ ఈసారి కూడా అలీకి నిరాశే ఎదురయింది. గతంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. అలీ మాత్రం జగన్ వైపు నిలబడ్డారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ తాను ఎంత కష్టపడినప్పటికీ.. పార్టీ సైడ్ నుంచి తగిన గుర్తింపు దక్కకపోవడంతో అలీ కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పడు అలీ ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. తనకు అత్యంత సన్నిహితుడయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతారా? లేదా తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకుంటారా? అన్నది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE