తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన మార్క్ స్పష్టంగా చూపించాడు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడంలో రేవంత్ దూకుడు, ఆయన నిర్ణయాలే కారణమని చెప్పవచ్చు. అందుకుతగ్గట్లే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అయితే రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై ఆయన నిర్ణయాలకు కాంగ్రెస్ అధిష్టానం కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్కరి ఆధిపత్యం కొనసాగదు… ఏ ఒక్కరి నిర్ణయాలో, ఏ ఒక్కరి ఆలోచనతోనే ఆ పార్టీ ముందుకు సాగదు.
ఉమ్మడి నిర్ణయాలనే అవలంబించడం మొదటి నుంచి ఆ పార్టీ కొనసాగిస్తున్న సాంప్రదాయం. అయితే తెలంగాణలో మాత్రం ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి నిర్ణయాలతోనే ముందుకు సాగింది. ఒక రకంగా ఆ నిర్ణయాలే పార్టీని తిరిగి గాడిన పెట్టాయి. అయితే కాంగ్రెస్ లో ఇతర సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి ఆధిపత్యంతో అప్పుడప్పుడు అధిష్టానం దగ్గర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రేవంత్ రెడ్డి జోరుకు బ్రేక్ లు వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు అందుకు తగ్గట్లుగానే ఈ పరిణామాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి.
నామినేటెడ్ పోస్టులు భర్తీ మొదలు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ వరకు ప్రతి అంశంలోనూ అధిష్ఠానం మునుపటిలా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తోందని ఆ పార్టీ వర్గాలు నుంచి సమాచారం వస్తోంది. ఇదివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంత చెప్తే అంతే అని తల ఆడించిన అధిష్టానం నుంచి ఇటీవల రేవంత్ రెడ్డి చుక్కెదురు నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన నామినేటెడ్ పోస్టులకు ఓ పట్టాన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తెలుసుకున్న అధిష్ఠానం, పార్టీలో సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులను ఢిల్లీకి పిలిపించుకొని వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుందట.
కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, నామినేటెడ్ పోస్టుల ఎంపికలో జిల్లా మంత్రులకు తెలియకుండా జాబితా ప్రకటించారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎంపీ ఎన్నికల వరకు జరిగిన అన్ని పరిణామాలపై ఆరా తీసిన అధిష్టానం, ఇక ముందు అలా ఉండదని, సమిష్టిగా తీసుకునే నిర్ణయాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన పేర్లను ఒకరిద్దరు సీనియర్లు వ్యతిరేకించడంతో.. వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఢిల్లీ కి పిలిపించి ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించడాన్ని కూడా సీనియర్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏది ఏమైనా తెలంగాణలో పది సంవత్సరాలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డైనమిజం కు తోడు ఇతర సీనియర్ నాయకులు ఆయనకు సహకరించడంతో సమిష్టిగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కి ఎప్పుడు ఉండే ఈ గ్రూప్ రాజకీయాలు మరోసారి ఈ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టివయనున్నాయన్న అనుమానం కలగకమానదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY