తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం రాత్రి ఎవరి ఊహకు కూడా అందకుండా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు.. మరికొందరు కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లారట. రేపో.. మాపో వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి పాలన కంటే.. ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే పనిలోనే నిమగ్నమయ్యారా? అన్న చర్చ నడుస్తోంది.
ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున నేతలను తమవైపు తిప్పుకుంటుంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది?.. ప్రత్యుర్థులను చేర్చుకునేందుకు అన్ని అనుమతులు రేవంత్ రెడ్డికి ఎలా ఇచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమయింది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని హైకమాండ్ చేరికల గురించి చర్చించిందట. ప్రత్యర్థులను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించిందట. అంతేకాకుండా ప్రస్తుతానికి చేరికలపై కాకుండా.. పాలనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఆదేశించిందట. చేరికల విషయంలో తాము ఆసక్తిగా లేమనే విషయాన్ని హైకమాండ్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించి చేరికల గురించి హైకమాండ్‌కు ఒక క్లారిటీ ఇచ్చారట. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు మాత్రమ వచ్చాయి. సీపీఐతో కలుపుకొని 65 అయ్యాయి. ఇటీవల ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ బలం 71 కి చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. సభలో బలం మాత్రం తక్కువగా ఉంది. ఈక్రమంలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌లాంటి వారిని ఎదుర్కొని.. వారి ఎత్తులను చిత్తు చేయాలంటే ముందు సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి వివరించారట. గతంలో వారు పాటించినట్లుగానే.. తాము కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాలని సభలో బలం పెంచుకోవాలని అన్నారట.
తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఈక్రమంలో చేరికల విషయంలో తాము వెనక్కి తగ్గితే బీజేపీ జోరు పెంచే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు చెప్పారట. వారి చూపు చేరికల మీద పడకముందే.. మనమే చేరికలపై ఫోకస్ చేయాలని లేదంటే తర్వాత ఎదురు దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని వెల్లడించారట. మొత్తానికి కాంగ్రెస్ పెద్దలకు అర్థమయ్యేలా చేరికలపై రేవంత్ రెడ్డి ఒక క్లారిటీని ఇచ్చారట. అందుకే చేరికల విషయంలో తుది నిర్ణయాన్ని రేవంత్ రెడ్డికి హైకమాండ్ వదిలేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF