తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అధికార.. విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ సభా వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బుధవారం శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిమ్మ చీకట్లతో నిండిపోతుందని.. అసలు వారికి పాలించే సత్తా ఉందా? అని పదేళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారని.. ఎన్నో రకాలుగా అవమానించారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రావని.. ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోతాయని భయపెట్టారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని.. నక్సలైట్ల రాజ్యం వస్తుందని అన్నారన్నారు. కానీ పదేళ్లులో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టామని.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చి దిద్దామని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లు అయితే.. 2022-23 లో రెవెన్యూ మిగులులు రూ. 5,944 కోట్లుగా ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తమకు రెవెన్యూ మిగులుతూ అప్పగిస్తే.. తాము అప్పులకుప్పగా మార్చామని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో ఉత్పత్తులు, సందప పెరిగిందని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే సభలో చెప్పారని అన్నారు. తెలంగాణ దేశానికి ఎకనామిక్ ఇంజిన్ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారని అన్నారు. రాష్ట్ర పురోగతిపై వాస్తవాలు చెప్పినందుకు వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల కోసం ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తీసుకునే అంశాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. స్కిల్ యూనివర్సిటీని తాము స్వాగతిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ